అవినీతి బయటపెడితే చంపేస్తారా!

ABN , First Publish Date - 2020-12-30T08:53:53+05:30 IST

రాష్ట్రంలో మున్నెన్నడూ లేని దుర్మార్గ, కిరాతక, ఉన్మాద పాలనను చూస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అవినీతి బయటపెడితే చంపేస్తారా!

  • పోగాలంతోనే జగన్‌ ఉన్మాద చర్యలు
  • రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌: చంద్రబాబు ఫైర్‌


అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మున్నెన్నడూ లేని దుర్మార్గ, కిరాతక, ఉన్మాద పాలనను చూస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రెస్‌మీట్‌ పెట్టాడని, సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టాడని బీసీ నేత నందం సుబ్బయ్య ప్రాణాలు తీస్తారా? వైసీపీ కుంభకోణాలను బయట పెట్టడం సుబ్బయ్య చేసిన నేరమా! అవినీతికి పాల్పడిన వాళ్లను, మట్కా దందాలు చేసే వాళ్లను వదలేసి, వాటిని బయటపెట్టిన వాళ్లను చంపేస్తారా! రాష్ట్రాన్ని జగన్‌ జంగిల్‌ రాజ్‌గా మారుస్తారా? పోగాలం దాపురించింది కాబట్టే ఇలాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరు టీడీపీ నేత నందం సుబ్బయ్య హత్యకు గురైన నేపథ్యంలో మంగళవారం కడప జిల్లా టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘ఇళ్ల పట్టాల్లో వైసీపీ అవినీతిని బయటపెట్టిన సుబ్బయ్యను పట్టాల పంపిణీ కార్యక్రమానికి పిలిపించి హతమార్చడం కన్నా కిరాతకం మరొకటి లేదు. నేరస్థులపై కఠిన చర్యలు లేకపోవడం వల్లే నేరాలు-ఘోరాలు పెచ్చుమీరాయి. తామేం నేరం చేసినా ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఉన్మాదులంతా పేట్రేగిపోతున్నారు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


 సీఎంకు, డీజీపీకి లేఖలు..

రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని, రూల్‌ ఆఫ్‌ లా భగ్నమైందని, శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని చంద్రబాబు ఆరోపించారు. తాడిపత్రిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి గ్యాంగ్‌ మారణాయుధాలతో వెళ్లి దౌర్జన్యం చేయడం, బాధితులపైనే ఎదురు కేసులు బనాయించడం వంటి దుర్మార్గాలపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌కు లేఖ రాశారు. ఎమ్మెల్యే భార్యకు మామూళ్లు ఇవ్వలేదని ఇసుక ఆపేశారని కాంట్రాక్టరు చెప్పడానికి, టీడీపీ నాయకుడికి సంబంధం ఉందా? అని నిలదీశారు. డీజీపీ గౌతంసవాంగ్‌కు మరో లేఖ రాశారు. కొందరు కింది స్థాయి పోలీసు అధికారుల తీరుపై ఫిర్యాదు చేశారు. కాగా.. విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై శ్రీరాముడి విగ్రహం ధ్వంసం చేయడాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు..

Updated Date - 2020-12-30T08:53:53+05:30 IST