రాజధాని నిర్మించకుండా భూముల్ని ఉంచుకోవడం ఆక్రమణే
ABN , First Publish Date - 2020-12-05T10:26:56+05:30 IST
రైతుల హక్కులు హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని పిటిషనర్లు వాదించారు.
హైకోర్టులో పిటిషనర్ల తరఫు వాదనలు పూర్తి
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : రైతుల హక్కులు హరించేలా చట్టాలు చేసే అధికారం రాష్ట్ర శాసన వ్యవస్థకు లేదని పిటిషనర్లు వాదించారు. రాజధాని నిర్మించకుండా భూములను దగ్గర ఉంచుకోవడం భూఆక్రమణకు పాల్పడడం కిందకే వస్తుందని, భూములు ఇచ్చిన రైతులను మోసగించడమేనని అవుతుందని పేర్కొన్నారు. రాజధానికి సంబంధించిన వ్యాజ్యాలపై హైకోర్టు చీఫ్‌జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుది విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణతో పిటిషనర్ల తరఫు వాదనలు ముగిశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు ఇతర ప్రతివాదులు తమ వాదనలు వినిపించేందుకు విచారణ సోమవారానికి వాయిదా పడింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ అమ్మినేని రామకృష్ణ, న్యాయవాది ఎం కిశోర్ బాబు, రైతు జొన్నలగడ్డ భరత్ కుమార్, బి. వరప్రసాద్ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాల పై శుక్రవారం న్యాయవాదులు వాదనలు వినిపించారు. న్యాయవాది కిశోర్‌బాబు వాదనలు వినిపిస్తూ...మూడు రాజధానుల నిర్ణయం సరికాదని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ విధంగా లేదన్నారు. న్యాయవాది కేఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ..సీఆర్‌డీఏను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని సెక్షన్ 3(జీ) ప్రకారం రాజధాని నిర్మాణాన్ని విరమించుకున్నప్పటికీ రైతులు ఇచ్చిన భూములు ప్రభుత్వం వద్దే కొనసాగుతాయని, ఇది రాజ్యాంగవిరుద్ధమన్నారు.
రాజధాని నిర్మించకుండా, భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించకుండా రైతులిచ్చిన భూమిని ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడం భూ ఆక్రమణ కిందకే వస్తుందని తెలిపారు. ‘‘అమరావతి కోసం కొంతమంది రైతుల నుంచి భూసమీకరణ, మరికొంతమంది దగ్గర భూసేకరణ పద్ధతి ద్వారా ప్రభుత్వం వేల ఎకరాల భూమి తీసుకుంది. భూసేకరణ కిందకు వచ్చిన వారికి దక్కే ప్రయోజనాలే భూసమీకరణలో ఇచ్చినవారికీ ఇవ్వాలి రైతుల మధ్య వ్యత్యాసం చూపడం రాజ్యాంగ విరుద్ధం. ప్రజల వద్ద నుంచి సలహాలు, సూచనలు సేకరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు తెలుగులో ప్రకటనలు ఇవ్వలేదు. దానివల్ల ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలకు చట్టబద్ధత ఉండదు’’ అని వివరించారు.
ప్రకటనలు తెలుగు భాషలో ఉండాలన్న అధికార భాషా చట్టం నిబంధనలు, సంబంధిత జీవోని కోర్టుకు ఆయన అందజేశారు. ఎమ్మెల్సీ రామకృష్ణ తరఫున నర్రా శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ...రాష్ట్రంలో ద్విసభ విధానం అమల్లో ఉందని, పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో శాసనమండలి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. పిటిషనర్ల వాదనలు ముగిసిన వెంట నే...విచారణను వారం రోజులు వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోరారు. పిటిషనర్లు కోర్టు ముందు ఉంచిన వివిధ తీర్పులను అధ్యయనం చేసేందుకు సమయం కావాలని కోరారు. ఆ అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.