కార్తీక దీపం ఉఫ్‌

ABN , First Publish Date - 2020-10-03T06:56:48+05:30 IST

విశాఖలో మరో భారీ ప్రాజెక్టు చేతులు మారింది. దాని పేరు కార్తీకవనం! విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 17 ఏళ్ల క్రితం మ్యాక్‌ లీజర్స్‌ అనే ప్రైవేటు సంస్థతో ‘

కార్తీక దీపం  ఉఫ్‌

విశాఖలో చేతులు మారిన భారీ ప్రాజెక్టు

నిర్వాహకులతో ఖరీదైన డీల్‌.. సగం వాటా మేఘాకు!

810 ఎకరాల్లో కార్తీకవనం బీచ్‌ రిసార్టు

ఈ లీజు భూమిలో ఎకరం 25 కోట్లు

8రూ.250 కోట్ల భూమీ, ప్రాజెక్టుపైనా అధికార పార్టీ పెద్దల కన్ను

తాళాలేసి పనులకు అడ్డంకులు

కీలక నేతను కలిశాకే లైన్‌ క్లియర్‌

లీజు భూములు ఆ సంస్థకే ఇచ్చి.. 

ఆనక లాగేసేందుకు పెద్దల ఎత్తు!


ప్రారంభోత్సవానికి సిద్ధమైన ‘కార్తీకవనం’ ప్రాజెక్టు ప్రాంగణానికి ఒక పోలీస్‌ అధికారి చేరుకున్నారు. గేట్లు మూయించి... తాళాలు వేయించారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని హుంకరించారు. ఆ తర్వాత ఆయనే... ‘పెద్దలతో’ మాట్లాడుకోవాలని సంకేతాలు పంపారు. ‘దండోపాయం’ ఫలించింది. ప్రాజెక్టులో వాటాలు దక్కాయి.


దొరికితే ఇది..కాదంటే అది అనే పాతతరహా దందాల్లేవు! అదీ, ఇదీ రెండూ కావాలనేదే కొత్త దోపిడీ ట్రెండ్‌! భూములూ కావాలి! ఆ భూముల్లో వచ్చే కంపెనీలపై పట్టూ కావాలి! కాకినాడ సెజ్‌, బందరు పోర్టు దారిలోనే విశాఖ ‘కార్తీకవనం’ కథ కూడా నడిచింది. ఈ ప్రాజెక్టు కోసం ప్రైవేటు సంస్థకు లీజుకు ఇచ్చిన భూమి విలువే రూ.250 కోట్లు! కంపెనీని కట్టడి చేయడం..కబ్జాకు వాటాల ముసుగేసి లాగేసుకోవడమనే ఎత్తునే అధికార పెద్దలు ఇక్కడా ప్రయోగించారు! ప్రాజెక్టులో సగం వాటా ఇచ్చేలా ఖరీదైన డీల్‌ను చేసేసుకున్నారు. బందరు పోర్టు దక్కించుకునే అవకాశమున్న ‘మేఘా’కే ఈ వాటాలూ అందడం గమనార్హం!


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

విశాఖలో మరో భారీ ప్రాజెక్టు చేతులు మారింది. దాని పేరు కార్తీకవనం! విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) 17 ఏళ్ల క్రితం మ్యాక్‌ లీజర్స్‌ అనే ప్రైవేటు సంస్థతో ‘నిర్మించు...నిర్వహించు...అప్పగించు (బీఓటీ)’ కింద చేసుకున్న ప్రాజెక్టు ఒప్పందం ఇది. విశాఖ-భీమిలి బీచ్‌రోడ్డులో సాగర్‌ నగర్‌ దగ్గర బీచ్‌ను ఆనుకొని పది ఎకరాల స్థలాన్ని 33 ఏళ్ల లీజుకు ఇచ్చింది. అందులో బీచ్‌ రిసార్ట్‌ కడతామని ఆ సంస్థ పేర్కొంది. ఏటా కొంత లీజు మొత్తం, ప్రాజెక్టు పూర్తయిన తరువాత లాభాల్లో కొంత వాటా ఇస్తామని చెప్పింది. అందులో కొంత అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయి.


అందులో నిర్మాణాలకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతులు అవసరమయ్యాయి. వాటిని సాధించేసరికి దశాబ్దం గడిచిపోయింది. ఆ తరువాత మ్యాగ్‌ లీజర్స్‌ కంపెనీలో కొత్తగా లాన్సమ్‌ కంపెనీ వాటాదారులు భాగస్వాములయ్యారు. ఈ ప్రాజెక్టు దాదాపు వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. ఇంతలో దానిపై అధికార పార్టీ పెద్దల కన్ను పడింది.


కార్తీకవనం ఉన్న ప్రాంతంలో ఎకరా భూమి రూ.25 కోట్లు పలుకుతోంది. పది ఎకరాల స్థలం విలువ రూ.250 కోట్లు. సరిగ్గా ఇక్కడే అధికార పార్టీ పెద్దలు కేంద్రీకరించారు. ప్రాజెక్టు భాగస్వాములను వేధించి, భయపెట్టి వాటాలు రాయించుకోవడానికి రంగం సిద్ధం చేశారు. సంస్థను కాళ్ల బేరానికి తెచ్చుకొనేందుకు అధికార బలాన్నంతా ప్రయోగించారు. ఈ క్రమంలో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఈ ప్రాజెక్టు ప్రాంగణానికి ఒక పోలీస్‌ అధికారి తాళాలు వేయించారు. అదేమని ప్రశ్నిస్తే...నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని సమాధానమిచ్చారు. పెద్దలతో మాట్లాడుకోవాలని పరోక్షంగా సందేశాలు ఇచ్చారు.


విశాఖలో అధికార పార్టీ వ్యవహారాలు చూస్తున్న నాయకుడిని ప్రాజెక్టు భాగస్వాములు కలిశారు. ప్రాజెక్టులో వాటా ఇస్తే ముందుకు వెళుతుందని, లేదంటే, రద్దయిపోతుందనే సంకేతాలు వెలువడ్డాయి. ఇన్నేళ్లు కష్టపడి నిర్మించుకున్న ప్రాజెక్టును చేజార్చుకునేందుకు మనసు రాక...ఆ డీల్‌కు ఒప్పుకొన్నారు. 50 శాతం వాటా ‘మేఘా కంపెనీ’కి ఇవ్వడానికి పత్రాలు రాసుకున్నట్టు సమాచారం.




పేరూ తెరమరుగు..

కార్తీకవనం ప్రాజెక్టులో అధికార పార్టీ చెప్పిన వారికి వాటా ఇచ్చాక పనులు పరుగుపెట్టాయి. ఏ అధికారీ అటు వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. ఆ ధీమాతో సదరు సంస్థ...అక్కడ నిర్మించిన బీచ్‌ రిసార్ట్‌ను నిర్వహణ కోసం అంతర్జాతీయ హోటల్‌ గ్రూపు ‘రాడిసన్‌’కు ఇచ్చేసింది. సదరు గ్రూపే ఇప్పుడు ఇక్కడ రిస్టార్‌ బాధ్యతలు చూస్తోంది. కార్తీకవనం పేరు కూడా మారిపోయి ఇప్పుడు ‘రాడిసన్‌ బ్లూ రిసార్ట్‌’గా వ్యవహరిస్తున్నారు. ఈ హోటల్‌ను జూన్‌లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, కరోనా నేపథ్యంలో వాయిదా పడింది.


ప్రభుత్వం నుంచి భూమిని లీజుకు తీసుకున్న సంస్థలు...పదేళ్ల తరువాత ఆ భూమిని శాశ్వతంగా స్వాధీనం చేసుకోవాలనుకుంటే...అందుకు సహకరిస్తామని ఇటీవల ప్రభుత్వం కొత్త పాలసీలో స్పష్టంచేసింది. కార్తీకవనం భూముల్ని లీజుకు తీసుకొని 17 ఏళ్లు అయింది. కాబట్టి ‘‘ఆ భూమి మాకు ఇచ్చేయండి’’ అని కోరే అవకాశముంది. అదే జరిగితే రూ.250 కోట్ల విలువైన స్థలం అధికార పార్టీ వారి చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ ప్రాజెక్టులో వీఎంఆర్‌డీఏకు లీజు రూపంలో ఇచ్చేది చాలా నామమాత్రపు మొత్తం.


ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై వీఎంఆర్‌డీఏకు సమాచారమే లేదు. భాగస్వాములు మారుతున్నా, వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకొని నిర్వహణ బాధ్యతలు అప్పగించినా  ‘ఇదేమిటి’ అని ఏనాడూ ప్రశ్నించలేదు. ఇవ్వాల్సిన లీజు ఇచ్చేస్తున్నప్పుడు వారు ఏమి చేసుకుంటే ఏంటంట? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. 



స్వతంత్ర సంస్థతో  దర్యాప్తు చేయించాలి

‘‘కార్తీకవనం ప్రాజెక్టు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణమయింది. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తున్నామని అటవీ శాఖను మోసం చేశారు. సీఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను ఉటంకిస్తూ తగిన చర్యలను తీసుకోవాలని ఎంఈఎ్‌ఫసీసీ సెక్రటరీకి లేఖ రాశాను. అలాగే గతంలో చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన అనిల్‌ పుణేఠాకు లేఖ రాశాను. ‘కార్తీకవనం’లో అక్రమాలు వెలుగులోకి రావాలంటే...స్వతంత్ర దర్యాప్తు సంస్థతో సర్వే చేయించాలి’’ 

- ఈఏఎస్‌ శర్మ, రిటైర్డ్‌ ఐఏఎస్‌ 





కాగ్‌ అక్షింతలు


కార్తీకవనం ప్రాజెక్టుకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిట్‌ జనరల్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రైవేటు పార్టీకి అనుకూలంగా ప్రయోజనం కలిగించేలా అన్ని శాఖలు వ్యవహరించాయని ఈ నివేదిక (21/2013) చాలా స్పష్టంగా తప్పుబట్టింది. మరోవైపు, ఈ ప్రాజెక్టుకు ఎంఈఎ్‌ఫసీసీ...పర్యావరణ అనుమతులు, సీఆర్‌జెడ్‌ అనుమతులు, అటవీ శాఖ అనుమతులు నిబంధనలతో మంజూరుచేసింది. అయితే ఈ ప్రాజెక్టు ఆ నిబంధనలను పాటిస్తున్నదా? లేదా? అనేది పర్యవేక్షించడంలో విఫలమైంది. కనీసం ప్రాంతీయ కార్యాలయం అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూడడం లేదు. 


అడుగడుగునా అతిక్రమణలే..


‘కార్తీకవనం’ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా సాగినట్టు పలు హోటల్‌, కార్పొరేట్‌ వర్గాలు అంటున్నాయి. భూ కేటాయింపు నుంచి నిర్మాణం దాకా అడుగడుగునా అతిక్రమణలతోనే నడిపించారని చెబుతున్నాయి. ఈ వర్గాల వాదన ప్రకారం, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ పరిధిలోని మినిస్టరీ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఫారెస్ట్‌ అండ్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ (ఎంఈఎ్‌ఫసీసీ) విధించిన నిబంధనలన్నీ ప్రాజెక్టు భాగస్వాములు తుంగలో తొక్కేశారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఏ అధికారి ఆ ప్రాంగణంలోకి రాకుండా అడ్డుకున్నారు. 


అతిక్రమణ1: విశాఖ ఎండాడ గ్రామం సర్వే నంబర్‌ 106లో 4 హెక్టార్ల (10 ఎకరాలు) భూమిని 2002లో మ్యాగ్‌ లీజర్స్‌కు నాటి వుడా నేటి వీఎంఆర్‌డీఏ లీజుకు కేటాయించింది. ఆ భూమి వుడాది కాదని అటవీ శాఖదని ఆ తరువాత తేలింది. అయితే అన్ని వర్గాలు రంగంలో దిగి అటవీ శాఖ భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేలా చక్రం తిప్పాయి. ఆ మేరకు విశాఖ నగరానికి 50 కిలోమీటర్ల దూరానున్న రాంబిల్లి మండలం కలవపల్లిలో భూమి ఇస్తున్నట్టు చూపించారు.


అయితే రాంబిల్లి మండలంలో తూర్పు నౌకాదళం ప్రత్యామ్నాయ స్థావరం, డీఆర్‌డీఓ కేంద్రం కోసం 676 హెక్టార్లు సేకరించారు. అందులో వుడా పేర్కొన్న భూమి కూడా ఉంది. అంటే అటవీ శాఖకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడం కుదరలేదు. పాడేరులో ఇచ్చామని చెబుతున్నా...ఎక్కడా దాని వివరాలు లేవు. ఇంకో విషయం ఏమిటంటే...ఎండాడలోని అటవీ భూమిలో చెట్లను తొలగించి పనులు చేపట్టారు. వాటికి సంబంధించిన పరిహారాన్ని ఇటు వుడా గానీ, అటు మ్యాగ్‌ లీజర్స్‌ గానీ అటవీ శాఖకు చెల్లించలేదు.


అతిక్రమణ-2: ప్రాజెక్టు కోసం కేటాయించిన భూములు సీఆర్‌జెడ్‌ పరిధిలో ఉన్నాయి. ఈ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో సముద్రం నుంచి 200 మీటర్ల (హై టైడ్‌ లైన్‌-హెచ్‌టీఎల్‌) వరకు నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు. అలాంటి భూమి ప్రాజెక్టులో 4.1 ఎకరాలు ఉంది. మిగిలిన 5.9 ఎకరాలు సముద్రం నుంచి 200-500 (హెచ్‌టీఎల్‌) మీటర్ల పరిధిలో ఉంది.


సముద్రం నుంచి 200 మీటర్లలోపు ఎటువంటి పక్కా నిర్మాణాలు చేపట్టకూడదని ఎంఈఎ్‌ఫసీసీ స్పష్టంగా పేర్కొంది. పైగా ఆ పరిధిలో బఫర్‌ జోన్‌లా 10 మీటర్ల వెడల్పున మొక్కల పెంపకం చేపట్టాలని సూచించింది. కానీ ప్రాజెక్టు స్థలానికి వెళ్లి చూస్తే నిర్మాణాలు అంతకు మించి ఉన్నాయి. 200 మీటర్ల నిబంధనను అసలు పాటించలేదు.


అతిక్రమణ-3: సముద్రానికి 500 మీటర్లలోపు బోర్లను యంత్రాలతో తవ్వకూడదు. అలా చేస్తే ఉప్పునీరు వచ్చేసి ఆ ప్రాంతంలో తాగునీటి జలాలు కలుషితమవుతాయి. దీనిపై  హైకోర్టు తీర్పు కూడా ఉంది. విశాఖలో ఒక స్టార్‌ హోటల్‌ ఇలాగే చేస్తే ఆ బోర్లను సీజ్‌ చేయాలని ఆదేశాలు వచ్చాయి. ఇప్పుడు మ్యాగ్‌ లీజర్స్‌ కూడా అక్రమంగా బోర్లు తవ్వి ఆ నీటిని వాడుతోంది. కానీ, అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతున్నారు. 


అతిక్రమణ-4: మ్యాగ్‌ లీజర్స్‌ సంస్థకు వుడా (ప్రస్తుతం వీఎంఆర్‌డీఏ) 10 ఎకరాలు కేటాయించగా అంతకంటే ఎక్కువ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టింది. వీరికి 17.41 రేఖాంశాలు, 83.10 అక్షాంశాల మధ్య కోఆర్డినేట్లు ఇవ్వగా, అవి కూడా సక్రమంగా లేవు.


Updated Date - 2020-10-03T06:56:48+05:30 IST