కరోనాతో చెలగాటం!

ABN , First Publish Date - 2020-04-07T09:50:50+05:30 IST

విజయవాడలో జరిగిందే... కర్నూలులోనూ జరిగింది. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కరోనాతో చెలగాటం!

కర్నూలులో లక్షణాలతో మృతి

ఫలితానికి ముందే మృతదేహం అప్పగింత

అంత్యక్రియలు చేసుకునేందుకు ఓకే

3 రోజుల తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ


కర్నూలు, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో జరిగిందే... కర్నూలులోనూ జరిగింది. కరోనాతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా కుటుంబ సభ్యులకు అప్పగించారు. చనిపోయిన సమయానికి ‘పాజిటివ్‌’ నిర్ధారణ కాకపోయినా... కరోనా లక్షణాలతో మరణించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించకూడదు. ఫలితం ‘నెగెటివ్‌’ వస్తే ఇబ్బంది ఉండదు. పాజిటివ్‌ వస్తే మృతదేహాన్ని భద్రంగా ప్లాస్టిక్‌ కవర్‌లో చుట్టి బంధువులకు అప్పగించాలి. ఒక ఉద్యోగి పర్యవేక్షణలో విద్యుత్‌ దహన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేయించాలి. కర్నూలులో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది.


పాణ్యంకు చెందిన 45 ఏళ్ల ఓ వ్యక్తి హృద్రోగ సమస్యతో ఈనెల 1వ తేదీన ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. అయితే... ఆయనకు కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో వైద్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆయన నమూనాలను కరోనా టెస్టు కోసం పంపించారు. శుక్రవారం ఆయన ఐసొలేషన్‌ వార్డులో  చనిపోయాడు. బంధువులు వచ్చేసరికే మృతదేహాన్ని వారికి అప్పగించేందుకు వీలుగా సిద్ధం చేశారు. కరోనా అనుమానాలు ఉండటంతో మృతదేహాన్ని అలా తీసుకెళ్లేందుకు బంధువులూ సందేహించారు. అయితే... భయపడాల్సిందేమీ లేదని, సంప్రదాయబద్ధంగా ఖననం చేసుకోవచ్చని వైద్యులు ధైర్యం చెప్పి మరీ పంపించారు. తీరా చూస్తే... మృతుడికి కరోనా సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయ్యింది. ఈ సమాచారాన్ని ఇప్పటికీ మృతుడి బంధువులకు అందించలేదు. ఆయనకు వైద్యం అందించిన 30 మంది ఆసుపత్రి సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. బాధితుడు హృద్రోగంతో చనిపోయినట్లు రికార్డుల్లో రాశారు.


‘తొలి’ నుంచీ నిర్లక్ష్యం... 

కర్నూలు జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసు నొస్సంలో బయటపడింది. రైల్వేలో పని చేస్తున్న రాజస్థాన్‌ యువకుడు బాధితుడుగా మారాడు. ఈ కేసులోనూ ప్రభుత్వాసుపత్రి ఉన్నతాధికారులు తప్పటడుగులు వేశారు. కరోనా అనుమానిత కేసుగా అడ్మిట్‌ అయిన ఆ వ్యక్తిని మూడ్రోజులపాటు ఐసొలేషన్‌కు పంపకుండా ఎమ్‌ఎమ్‌-3 వార్డులో ఉంచి సాధారణ రోగిలాగే చికిత్సలు అందించారు. సిబ్బంది, వైద్యులు కూడా ఎలాంటి మాస్క్‌లు, యూనిఫాం కోడ్‌ లేకుండానే చికిత్స చేశారు. ఆ తర్వాత... అతనికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో వైద్యుల వెన్నులో వణుకు మొదలైంది. దీంతో సీనియర్లు, జూనియర్లతోపాటు సిబ్బందికీ కరోనా పరీక్షలు చేయించారు. వారిలో కొందరికి నెగెటివ్‌ అని తేలడంతో ప్రస్తుతం ఊపిరి పీల్చుకుంటున్నారు.

Updated Date - 2020-04-07T09:50:50+05:30 IST