అరబిందోకి అంబులెన్సుల అప్పగింతలో అవినీతి!

ABN , First Publish Date - 2020-06-16T10:00:10+05:30 IST

‘‘అంబులెన్స్‌ సేవలను తక్కువ ధరకు ఇస్తుంటే కాదన్నారు. ధరను భారీగా పెంచి ‘అరబిందో’కు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? రాష్ట్ర ..

అరబిందోకి అంబులెన్సుల అప్పగింతలో అవినీతి!

గతంలో బీవీజీకి ఒక్కో వాహనానికి 1.31 లక్షలు చెల్లింపు

గడువు ముగియకముందే... 2.21 చెల్లింపునకు అంగీకారం

ప్రభుత్వానికి నష్టం..రద్దు చేసుకోవాలి: కన్నా 


అమరావతి, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): ‘‘అంబులెన్స్‌ సేవలను తక్కువ ధరకు ఇస్తుంటే కాదన్నారు. ధరను భారీగా పెంచి ‘అరబిందో’కు ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల నష్టం కలిగించే ఈ ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. సోమవారం కన్నా ఆ మేరకు సీఎం జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు. బీవీజీ సంస్థతో ఐదేళ్ల కాలానికి 2018లో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆ ఒప్పందం ప్రకారం నెలకు ఒక వాహనానికి ప్రభుత్వం 1.31 లక్షలు చెల్లిస్తోందన్నారు.


గడువు ముగియక ముందే 108 అంబులెన్స్‌ల నిర్వహణ కోసం అరబిందో ఫార్మా ఫౌండేషన్‌కు 2.21 లక్షలు చెల్లించడంలో మతలబు ఏంటని నిలదీశారు. కొత్తగా కొనుగోలు చేసే వాటికి 1.78 లక్షలు చెల్లించడాన్ని కూడా కన్నా ప్రశ్నించారు. తక్కువ ధరకు వస్తోన్న సేవల్ని కాదని భారీగా ధరలు పెంచి చెల్లించడంపై సీఎం సమాధానం చెప్పాలన్నారు. ఈకాంట్రాక్టుల్లో ఎంపీ విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు రోహిత్‌ రెడ్డి, అరబిందో ఛైర్మన్‌ రామ్‌ప్రసాద్‌ రెడ్డి పాత్ర తేల్చాలన్నారు.

Updated Date - 2020-06-16T10:00:10+05:30 IST