‘కాళేశ్వరం’ కొత్తదే
ABN , First Publish Date - 2020-10-04T08:06:28+05:30 IST
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చి రీ- డిజైనింగ్ చేశామే తప్ప
పాలమూరు-రంగారెడ్డి పాతది కాదు.. దానికి ప్రధాని ప్రసంగమే నిదర్శనం
‘అపెక్స్’ వాదనలు సిద్ధం చేస్తున్న ఏపీ... నేడు సన్నాహక సమావేశం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పేరును కాళేశ్వరం ఎత్తిపోతల పథకంగా మార్చి రీ- డిజైనింగ్ చేశామే తప్ప కొత్త పథకం కాదంటూ తెలంగాణ చేస్తున్న వాదనలో పసలేదని సాంకేతికాంశాలతో సహా నిరూపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ‘ప్రాణిహిత-చేవెళ్ల పథకానికి వైఎస్ హయాంలో 196 టీఎంసీల నుంచి ఇప్పుడు కాళేశ్వరం ఎత్తిపోతలకు భారీగా నీటి వాడకం అంచనాలు పెంచేసి పాతదే అంటే ఎలా?’ అని ఈనెల 6న జరుగనున్న అపెక్స్ కమిటీ సమావేశంలో నిలదీసేందుకు సిద్ధమవుతోంది.
రాయలసీమ ఎత్తిపోతలను వ్యతిరేకిస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ లేఖ రాసిన నేపథ్యంలో... రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఏపీ సీఎం జగన్ అప్పటికప్పుడు సమావేశమయ్యారు. తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలను తిప్పికొట్టేందుకు అవసరమైన సాంకేతిక ఆధారాలు ఉన్నందున అపెక్స్ కౌన్సిల్ సమావేశంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాలకు ఇప్పటికే కేటాయించిన 111టీఎంసీల నీటి వినియోగం వివరాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని నిర్మిస్తామంటూ 2014, 2019 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలను ఉటంకిస్తూ వాటిని పాతవిగా కేసీఆర్ చెబుతున్నారని, అవి పాతవే అయితే వాటిని నిర్మిస్తామంటూ మోదీ అప్పట్లో హామీ ఎందుకిచ్చారని ప్రశ్నిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం కోసం డిమాండ్ చేస్తున్న తెలంగాణ మరోవైపు నీటి కేటాయింపుల విషయంలో ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన విషయం సీఎం వద్ద చర్చకు వచ్చింది.
గోదావరి, కృష్ణా జలాలు, ప్రాజెక్టుల విషయంలో ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలో, అపెక్స్‌లో వాదించాలో తెలియని అయోమయంలో ఆ రాష్ట్రం ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది. నీటి కేటాయింపులను ట్రైబ్యునల్ ఖరారు చేస్తుందని, ఆ అధికారం అపెక్స్ కౌన్సిల్‌కు లేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. సీమ ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు ఉన్నందున వాటికి లోబడి ఉంటే అపెక్స్ కౌన్సిల్ అభ్యంతరం తెలిపే అవకాశం లేదని అధికారులు వివరించారు. అపెక్స్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆదివారం పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి చర్చిద్దామని అధికారులకు జగన్ సూచించారు.