మూడు ముక్కలు సరికాదు

ABN , First Publish Date - 2020-07-20T08:35:33+05:30 IST

అమరావతే ప్రజా రాజధానిగా నాడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ ..

మూడు ముక్కలు సరికాదు

అమరావతిని నాడు ఆమోదించి నేడు వికేంద్రీకరణ అంటారా? : కళా 


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: అమరావతే ప్రజా రాజధానిగా నాడు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు ఆమోదం తెలిపిన జగన్మోహన్‌రెడ్డి... ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట ఆడడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాన్ని జగన్‌, బొత్స సత్యనారాయణ మర్చిపోయారా? అని ప్రశ్నించారు. స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్‌ను పణంగా పెట్టాలని చూడడం వైసీపీ ప్రభుత్వానికి తగదని ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.


గత ఐదేళ్లలో ఏ రాజకీయ పార్టీ, ప్రజాసంఘాలు రాజధానిగా అమరావతి తప్పు అన్న దాఖలా లేదని స్పష్టం చేశారు. జగన్‌ ఇప్పుడు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం సరికాదని 5 కోట్ల ప్రజలు, మేధావులు, రాజకీయ పక్షాలు తూర్పారపడుతున్నాయన్నారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో వైసీపీ నేతలు ఆక్రమించుకున్న వేల ఎకరాల భూముల కోసమే జగన్‌, బొత్స, అవంతి శ్రీనివాస్‌, విజయసాయిరెడ్డి నానా యాగీ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.  


అధికార మదం తలకెక్కింది : దేవినేని

వైసీపీ ప్రభుత్వానికి అధికార మదం తలకెక్కిందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ట్విటర్‌లో ఆరోపించారు. ‘తెలుగు వారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పిన స్వర్గీయ ఎన్టీఆర్‌ విగ్రహాన్ని తొలగించారు. ఏపీలో దోచుకో.... తమిళనాడులో దాచుకో అనే జగనన్న దోపిడీ పథకం కింద తరలుతూ పట్టుబడ్డ రూ.5.25 కోట్లపై నోరెందుకు విప్పడం లేదు సీఎం జగన్‌ గారు..! అన్ని కోట్లు ఎక్కడి నుంచొచ్చాయి? జగన్‌ చెన్నై హవాలానా?’ అని దేవినేని ట్వీట్‌ చేశారు.


పార్లమెంటు ధిక్కరణే : చినరాజప్ప

రాజధాని అమరావతి మార్పు పార్లమెంటును ధిక్కరించడమేనని మాజీ మంత్రి చినరాజప్ప అన్నారు. సెలెక్ట్‌ కమిటీ, కోర్టుల పరిధిలో ఉన్న బిల్లులను గవర్నర్‌కు ఎలా పంపుతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఆఫీసులు మార్చడం కాదని, స్థానిక సంస్థలకు విధులు, నిధులు బదలాయించడమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.


ఆమోదిస్తే మండలిని అగౌరవపర్చినట్లే : వైవీబీ

రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను తిరస్కరించి, రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపాలని టీడీపీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ బిల్లులను ఆమోదిస్తే శాసన మండలిని అగౌరవపర్చినట్లేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం గవర్నర్‌కు ఆయన లేఖ రాశారు. 

Updated Date - 2020-07-20T08:35:33+05:30 IST