భూ దోపిడీ కోసం విశాఖను బలి చేస్తున్నారు: కళా వెంకట్రావు

ABN , First Publish Date - 2020-07-20T00:25:46+05:30 IST

నాడు అమరావతే రాజధానిగా తీర్మానం చేస్తే అంగీకరించింది వాస్తవం కాదా? అని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు.

భూ దోపిడీ కోసం విశాఖను బలి చేస్తున్నారు: కళా వెంకట్రావు

అమరావతి: నాడు అమరావతే రాజధానిగా తీర్మానం చేస్తే అంగీకరించింది వాస్తవం కాదా? అని టీడీపీ నేత కళా వెంకట్రావు ప్రశ్నించారు. నేడు వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట కక్ష పూరితం కాదా? అని ఆయన ప్రశ్నించారు. మూడు ముక్కల నిర్ణయంతో రాజధాని రైతుల గుండెలపై కుంపటి పెట్టారని మండిపడ్డారు. అమరావతికి నాడు జగన్మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం వాస్తవం కాదా? అన ప్రశ్నించారు. అమరావతే రాజధాని అనే నిర్ణయాన్ని ప్రజలు, రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయన్నారు. నేటి మూడు ముక్కలాటను అన్ని పక్షాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.


రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలాంటి నిర్ణయం తీసుకోదన్నారు. సెలెక్ట్ కమిటీ వద్దకు వెళ్లిన బిల్లుల్ని ఆమోదించమని గవర్నర్‌కు ఎలా అడుగుతారు? అని ఆయన ప్రశ్నించారు. జగన్, విజయసాయిరెడ్డి భూ దోపిడీ కోసం విశాఖను బలి చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘అమరావతి పూర్తైతే రాష్ట్రానికి సరిపడా సంపద సమకూరుతుందని తెలియదా?..టీడీపీ హయాంలో ప్రతి జిల్లాకు పెట్టుబడులు తెచ్చాం. ఈ ఏడాదిలో ఈ ప్రభుత్వం ఏం చేసిందో మంత్రి బొత్స సమాధానం చెప్పాలి. వచ్చిన పెట్టుబడుల్ని, పరిశ్రమలను తరిమేయడమే అభివృద్ధి వికేంద్రీకరణా?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2020-07-20T00:25:46+05:30 IST