సెజ్‌పై ‘బల్క్‌’ స్కెచ్‌

ABN , First Publish Date - 2020-10-01T07:29:44+05:30 IST

కాకినాడ సెజ్‌ను దక్కించుకోడానికి ఒకటి కాదు, ఎన్నెన్నో స్కెచ్‌లు! రాష్ట్రానికి బల్క్‌డ్రగ్‌ పార్కు మంజూరు చేయాలని దరఖాస్తు చేయడానికి ముందే పక్కా పన్నాగం! అరబిందో సంస్థ చేతిలో ఈ పార్కు పెట్టడానికే జీఎంఆర్‌ సంస్థకు భోగాపురం ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు పందేరం...

సెజ్‌పై ‘బల్క్‌’ స్కెచ్‌

  • బల్క్‌డ్రగ్‌ పార్కుపైనే పెద్దల కన్ను
  • పార్కు ఏర్పాటుకు అనువుగా కె-సెజ్‌ 
  • అరబిందోను ముందుపెట్టి పావులు
  • జీఎంఆర్‌ వాటాలు కొన్న అరబిందో
  • పార్కు వస్తే ఆ సంస్థతోనే నిర్వహణ
  • కేంద్రమిచ్చే రూ.వెయ్యికోట్ల గ్రాంట్‌
  • వినియోగంలో పెద్దలకు సొంత ’లెక్క’
  • సెజ్‌లోని ఓడరేవుపైనా పట్టుకు ప్లాన్‌


(కాకినాడ- ఆంధ్రజ్యోతి)

కాకినాడ సెజ్‌ను దక్కించుకోడానికి ఒకటి కాదు, ఎన్నెన్నో స్కెచ్‌లు! రాష్ట్రానికి బల్క్‌డ్రగ్‌ పార్కు మంజూరు చేయాలని దరఖాస్తు చేయడానికి ముందే పక్కా పన్నాగం! అరబిందో సంస్థ చేతిలో ఈ పార్కు పెట్టడానికే జీఎంఆర్‌ సంస్థకు భోగాపురం ఎయిర్‌పోర్టు కాంట్రాక్టు పందేరం! ఆ వెంటనే అన్ని అనుకూలతలున్న కాకినాడ సెజ్‌లో జీఎంఆర్‌ వాటా అరబిందో పరం! కేంద్రం నుంచి బల్క్‌ డ్రగ్‌పార్కు మంజూరైతే అరబిందో కనుసన్నల్లో వ్యవహారం నడిపించడానికి ప్రభుత్వ పెద్దలు ఆడించిన డీల్‌.. గోల్‌ ఇదే! ఈ ప్లాన్‌ దెబ్బతింటే ప్లాన్‌ బీని ఇప్పటికే సిద్ధం చేశారు. ఒకవేళ కేంద్రం బల్క్‌ డ్రగ్‌ పార్కు మంజూరులో చెయ్యిస్తే ఏకంగా అరబిందోతోనే ఫార్మాసిటీ పెట్టించే ప్రత్యామ్నాయ పథకం కూడా పెద్దలు సిద్ధం చేశారని సమాచారం.


కాకినాడ సెజ్‌లో 51 శాతం వాటాను అరబిందో రియల్టీకి జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా విక్రయించిన డీల్‌ వెనుక భారీ కథే నడిచిందని పారిశ్రామిక, కార్పొరేట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. దేశంలో ఫార్మా రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం ఈ ఏడాది కొత్త పథకం ప్రవేశపెట్టింది. దేశంలో మూడు కొత్త బల్క్‌ డ్రగ్‌ పార్కులు రూ.3 వేల కోట్లతో మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. వీటికోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం కోరింది. నిబంధనలతో కూడిన మార్గదర్శకాలనూ విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం అన్ని అనుకూలతలు ఒక్క కాకినాడసెజ్‌కే ఉన్నాయి. పార్కు ఏర్పాటు చేయాలంటే వెయ్యి ఎకరాలకు పైగా భూములను చూపించాలి. కాకినాడ సెజ్‌లో రెండువేల ఎకరాలకుపైగా భూములు అందుబాటులో ఉన్నాయి. హైవేకు 25 కిలోమీటర్ల దూరంలో ఉండాలని నిర్దేశించగా, ఈసెజ్‌ కోల్‌కతా-చెన్నై హైవేకు 20 కిలోమీటర్లలోపే ఉంది. ఎయిర్‌పోర్టుకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొనగా, సెచ్‌కు రాజమహేంద్రవరం,విశాఖ విమానాశ్రయం ఇంకా దగ్గర్లోనే ఉన్నాయి. పైగా సెజ్‌ నుంచి హైవేకు రూ.350 కోట్లతో భారతమాల ప్రాజెక్టు కింద కేంద్రం రహదారి నిర్మిస్తోంది. దీంతో కాకినాడసెజ్‌పై పెద్దలు కేంద్రీకరించారు. ఇక్కడ తమ వారితో పాగావేయిస్తే మంజూరయ్యే బల్క్‌డ్రగ్‌  పార్కు ద్వారా లబ్ద్ధిపొందొచ్చని యోచించారు. అయితే సెజ్‌లో ప్రధాన వాటాదారైన జీఎంఆర్‌ గ్రూపు దృష్టంతా ఇన్‌ఫ్రా, ఓడరేవుల అభివృద్ధిపైనే ఉంది. కాబట్టి, ఆ సంస్థ బల్క్‌ డ్రగ్‌ పార్కును సెజ్‌లో ఏర్పాటుచేయడానికి అంగీకరించదు. కాబట్టి తమపని అరబిందోతో చేయించుకోవాలని పెద్దలు నిర్ణయించారు. జీఎంఆర్‌కు భోగాపురం ఎయిర్‌పోర్టు కట్టబెట్టి.. కాకినాడ సెజ్‌ వాటాను అరబిందోకు విక్రయించేలా డీల్‌సెట్‌ చేశారు. ఇలా తెర వెనుక రంగమంతా సిద్ధమయిన తరువాతే.. కాకినాడ సెజ్‌ను బల్క్‌డ్రగ్‌పార్కు ఏర్పాటు కోసం ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసింది. 


‘నిధుల’పైనా ముందే డీల్‌

బల్క్‌డ్రగ్‌పార్కు మంజూరైన రాష్ట్రానికి కేంద్రం రూ.వెయ్యికోట్ల వన్‌టైం గ్రాంట్‌ కింద నిధులు ఇస్తుంది. సెజ్‌లో మౌలిక సదుపాయాలు కల్పనకు ఈ నిధులు వాడాల్సి ఉంటుంది. అరబిందో చేతికి పార్కు వస్తే.. ఆ నిధులను ఎలా ‘వినియోగించాలి’ అనేదీ ముందే పెద్దలు ఒప్పందాలు చేసుకొన్నారని సమాచారం. అలాగే.. కాకినాడ సెజ్‌లో ఓడరేవు నిర్మాణం కూడా జరిగితే విదేశాలకు ఎగుమతి, దిగుమతుల పేరుతో పోర్టుల్లోను పాగా వేయొచ్చునని యోచించారు. 


రాంకీ తరహాలో..

కేంద్రం మంజూరు చేసే మూడు బల్క్‌ డ్రగ్‌ పార్కులకు దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవేళ రాష్ట్రానికి పార్కు రాకపోతే తమ ప్రయోజనాలకు గండిపడకుండా ఉండేలా పెద్దలు మరో ప్రత్యామ్నాయం కూడా సిద్ధం చేశారు. అందులో భాగంగా కాకినాడ సెజ్‌లో అరబిందోతో సొంతంగా ఫార్మాసిటీని ఏర్పాటు చేయించాలని చూస్తున్నారు. ప్రస్తుతం విశాఖ నగరానికి సమీపంలోని పరవాడలో రాంకీ సంస్థ సొంతంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేసింది. దీన్ని ఫార్మా సెజ్‌ అని కూడా పిలుస్తారు. మొత్తం రెండు వేల ఎకరాల్లో విస్తరించిన ఈ పార్కులో అనేక ఫార్మా కంపెనీలు ఉత్పత్తి సాగిస్తున్నాయి. దాదాపు వంద యూనిట్ల వరకు ఇందులో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అచ్చం ఇదే తరహాలో కాకినాడ సెజ్‌లోనూ అరబిందో ద్వారా సొంతంగా ఫార్మాసిటీ ఏర్పాటు చేయించడానికి పెద్ద ఎత్తున పథకం సిద్ధం అయింది. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే అనుమతులు కూడా ఉండడంతో చకచకా సదరు కంపెనీకి అన్ని రకాల సాయం చేయాలని కూడా నిర్ణయించారు. 


Updated Date - 2020-10-01T07:29:44+05:30 IST