డబ్బులొద్దు.. న్యాయం కావాలి

ABN , First Publish Date - 2020-11-13T09:06:18+05:30 IST

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షలు చెక్కును తీసుకోవడానికి ఆయన అత్త మాబున్నీసా

డబ్బులొద్దు.. న్యాయం కావాలి

25లక్షలు చెక్కు నిరాకరించిన సలాం అత్త

బాధ్యులను శిక్షించాలని గట్టిగా డిమాండ్‌

ఎంతగానో నచ్చజెప్పిన తరువాతే సమ్మతి

రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ పరామర్శ

తప్పక చర్యలు తీసుకొంటామని హామీ

బెయిల్‌ రద్దుపై విచారణ 16కు వాయిదా


నంద్యాల, నవంబరు 12: ర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌ సలాం కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షలు చెక్కును తీసుకోవడానికి ఆయన అత్త మాబున్నీసా తొలుత నిరాకరించారు. ‘డబ్బులు వద్దు.. న్యాయం చేయండి సార్‌’ అని చెక్కు ఇవ్వడానికి తనను కలిసిన జిల్లా కలెక్టర్‌, ఎంపీ, ఎమ్మెల్యేలకు తేల్చిచెప్పారు. కళ్ల ముందే నిండు కుటుంబాన్ని పోగొట్టుకున్నానని భోరున విలపించారు. ఎంతో నచ్చజెప్పిన తర్వాతగానీ ఆమె ఆ చెక్కును అందుకోలేదు. గురువారం కర్నూలు జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి ప్రభుత్వం మంజూరు చేసిన చెక్కును అందజేయడానికి సలాం ఇంటికి వచ్చారు. చెక్కును తీసుకోవాల్సిందిగా అధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు సలాం అత్త మాబున్నీసాను కోరారు. అందుకు ఆమె నిరాకరించారు. తన కూతురు, అల్లుడు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక ఉన్న అసలైన నిందితులను శిక్షించాలని ఆమె కోరారు.


ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి చాలాసేపు ఆమెకు సర్ది చెప్పారు. ‘‘ఇది ప్రభుత్వం ఇస్తున్న సాయం. సలాం కుటుంబానికి గుర్తుగా, గుర్తిండిపోయేలా మీ మనస్సుల్లో ఏముందో ఆ ప్రకారమే రూ.25 లక్షలు మొత్తంతో చేయాలి’’ అని సూచించారు. జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, సబ్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సలాం కేసులో న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఎలాంటి సమస్య ఎదురైనా నేరుగా తమ దృష్టికి తీసుకు రావాలని సూచించారు. అనంతరం మాబున్నీసాకు రూ.25 లక్షల చెక్కును అందజేశారు. ఈ పరిహారంతో సలాం పేరుతో మసీదు కట్టిస్తానని మాబున్నీసా తెలిపారు. కాగా, అబ్దుల్‌ సలాం కుటుంబ సభ్యులను ఏపీ మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఎస్‌ఎం జియావుద్దీన్‌, వైస్‌ చైర్మన్‌ మనోజ్‌కుమార్‌, సభ్యుడు జిలానీ బాషా పరామర్శించారు. సలాం కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కమిషన్‌ పోరాడుతుందని చైర్మన్‌ జియావుద్దీన్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నాంటే పోలీసుల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోందన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


కావాలనే నోటీసు ఇవ్వలేదా?

 సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితులైన పోలీసుల బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ 16వ తేదీకి నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు జడ్జి సువర్ణరాజు వాయిదా వేశారు. కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసు అధికారులు ఈనెల 10వ తేదీన జిల్లా మూడో అదనపు కోర్టులో ఈ పిటిషన్‌ వేశారు. పిటిషన్‌కు సంబంధించిన కాపీలను ముద్దాయిలకు సర్వ్‌ చేసేందుకు, ఇరు పక్షాల వాదనలు వినేందుకు 12 వ తేదీకి విచారణ వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో మొదటి నిందితుడైన సీఐ సోమశేఖర్‌రెడ్డికి నోటీసులు సర్వ్‌ చేయగా, ఆయన తరఫు న్యాయవాది జయరామిరెడ్డి కోర్టుకు హాజరై కౌంటర్‌ దాఖలుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. రెండో నిందితుడైన హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌కు నోటీసులను పోలీసులు సర్వ్‌ చేయకపోవడంతో బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ ఈనెల 16వ తేదీకి జడ్జి సువర్ణరాజు వాయిదా వేశారు. హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌కు నోటీసులు సర్వ్‌ చేయాల్సిందిగా పీపీ మహమ్మద్‌ రఫీకి ఆదేశాలు జారీ చేశారు. కాగా, గంగాధర్‌కు నోటీసులు సర్వ్‌ చేయకపోవడం వెనుక ఏదో మతలబు దాగి ఉందన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా కోసం పోలీసులే తెరవెనుక తతంగం నడిపి నిందితుల్లో ఒకరికి నోటీసులు చేర్చలేదని పలువురు న్యాయవాదులు అనుమానిస్తున్నారు. 


పరిహారంతో చేతులు దులుపుకొంటారా?

సలాం ఇంటికి సీఎం రావాల్సిందే 

మాజీ జడ్జి శ్రవణ్‌కుమార్‌  

అబ్దుల్‌ సలాం కుటుంబం పోలీసుల వేధింపుల తాళలేక ఆత్మహత్య చేసుకుంటే, రూ.25 లక్షలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం దారుణమని మాజీ జడ్జి శ్రవణ్‌కుమార్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, హోం మంత్రి మేకతోటి సుచరిత సలాం ఇంటికి వచ్చి, బాధితులకు భరోసా ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ అధ్యక్షుడు బషీర్‌ అహమ్మద్‌తో కలిసి గురువారం అబ్దుల్‌ సలాం కుటుంబాన్ని మాజీ జడ్జిలు శ్రవణ్‌కుమార్‌, రామకృష్ణ కలుసుకొన్నారు. సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు అరగంటలో బెయిల్‌ రావడానికి ప్రభుత్వమే కారణమని  ఈ సందర్భంగా శ్రవణ్‌కుమార్‌ దుయ్యబట్టారు. ఈ కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-11-13T09:06:18+05:30 IST