జడ్జిలపై జులుం!

ABN , First Publish Date - 2020-10-12T08:54:23+05:30 IST

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై పలువురు న్యాయ నిపుణులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

జడ్జిలపై జులుం!

న్యాయవ్యవస్థను భయపెట్టే ప్రయత్నం

ముఖ్యమంత్రి జగన్‌పైనే కేసులున్నాయి

విచారణను ఆపడమే ఆయన ఉద్దేశం

జస్టిస్‌ రమణను బెంచ్‌ నుంచి తప్పించే కుట్ర

న్యాయ వ్యవస్థపై నిజంగా నమ్మకముంటే

సీజే స్పందన కోసం వేచి చూసేవాళ్లు

లేఖను బయటపెట్టడం అనైతికం

ఏపీ సర్కారు తీరుపై న్యాయనిపుణుల ఆందోళన


ఎవరైనా కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై పైకోర్టుకు వెళ్లడం సహజం. కానీ, వైసీపీ పెద్దలు జడ్జిల చిత్తశుద్ధి మీదే అనుమానాలున్నాయంటూ పెద్ద వివాదానికి తెరలేపారు. నిర్దిష్టంగా కొందరు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు ఈనెల 6వ తేదీన లేఖ రాశారు. దానిని... 8వ తేదీన అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆకస్మికంగా మీడియా ముందుకు వచ్చేశారు. ‘హైడ్రామా’ సృష్టించారు. సీజేకు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు పలురకాల పత్రాలు బహిర్గతం చేశారు. జడ్జిల పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. నిజంగా న్యాయ వ్యవస్థపైన, సుప్రీంకోర్టుపైన గౌరవం ఉంటే... తమ ఫిర్యాదుపై చీఫ్‌ జస్టిస్‌ స్పందన కోసం వేచి చూసేవారని, ఫిర్యాదు పత్రాలు బహిర్గతం చేసే వారు కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. మీడియా ముందు రచ్చ చేయడంతో వైసీపీ పెద్దల దురుద్దేశాలు బయటపడిపోయాయని అభిప్రాయపడుతున్నారు. 


న్యూఢిల్లీ, అక్టోబరు 11: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై పలువురు న్యాయ నిపుణులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఇది న్యాయ వ్యవస్థను భయోత్పాతానికి గురి చేసే ప్రయత్నం’ అని తెలిపారు. చీఫ్‌ జస్టి్‌సకు ముఖ్యమంత్రి లేఖ రాయడం... దాంతోపాటు జత చేసిన పత్రాలను మీడియాకు విడుదల చేయడం వెనుక కచ్చితంగా తప్పుడు ఉద్దేశాలున్నాయని స్పష్టం చేశారు. నేర నేతలపై కేసుల సత్వర పరిష్కారానికి సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంటున్న సమయంలోనే... మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులపై ఏసీబీ కేసు పెట్టడం... ఆపై ముఖ్యమంత్రి సుప్రీం సీజేకు లేఖ రాయడం, ఆ పత్రాలన్నీ బయటపెట్టడం వంటి చర్యలతో ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. సుప్రీంకోర్టుకు అమికస్‌ క్యూరీగా వ్యవహరించిన విజయ్‌ హన్సారియాతోపాటు పలువురు సీనియర్‌ న్యాయవాదుల అభిప్రాయాలను ఉటంకిస్తూ ‘ది ప్రింట్‌’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ అంశంపై ఎవరేమన్నారంటే... 


జగన్‌ది బెంచ్‌ హంటింగ్‌!

న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసి, ఆ అంశాలను మీడియాకు విడుదల చేయడం అనైతికం. నేర నేతలపై కేసుల అంశం ఇప్పుడు కొలిక్కి వచ్చింది. దీనిపై జస్టిస్‌ రమణ విచారణ జరపకుండా ఆపాలన్నదే జగన్‌ ఉద్దేశం. అందుకే... ‘బెంచ్‌ హంటింగ్‌’కు (ధర్మాసనం నుంచి ఒక జడ్జిని తప్పించే ప్రయత్నం) పాల్పడుతున్నారు.’’

అశ్వనీ కుమార్‌ ఉపాధ్యాయ 


(నేతలపై కేసులు త్వరగా తేల్చాలని కోర్టుకెళ్లిన లాయర్‌)

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఆరోపణలపై ఎవరేమన్నారంటే.. 


న్యాయ ప్రక్రియను దెబ్బతీసేందుకే!

‘‘ప్రజా ప్రతినిధులపై కేసుల సత్వర పరిష్కారానికి ఆదేశాలు జారీచేయాలన్న పిటిషన్‌పై విచారణ జరుగుతున్నప్పుడే... జడ్జిపై ఏసీబీ కేసు నమోదైంది. ఏపీ సీఎం స్వయంగా తీవ్రమైన అవినీతి నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. అంటే... ఆయన చర్యల వెనుక ఉద్దేశమేమిటో స్పష్టంగా తెలిసిపోతోంది. నేతలపై కేసులు త్వరగా తేల్చాలన్న పిటిషన్‌ కీలక దశకు చేరిన సమయంలోనే... సీజేకు జగన్‌ లేఖ రాశారు. దానిని బహిర్గతం చేశారు. 


ఈ చర్యల వెనుక న్యాయ ప్రక్రియను దెబ్బతీయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది.  హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ఏపీ ప్రభుత్వం ఆ అవకాశాన్ని వాడుకోవాల్సింది. కానీ... ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అవాంఛనీయమైన దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదిస్తున్న న్యాయవాదులు ఈ విషయాన్ని గుర్తించి... తమ నిర్ణయంపై పునరాలోచిస్తారని భావిస్తున్నాను’’

బాలాజీ శ్రీనివాసన్‌, సుప్రీంకోర్టు న్యాయవాది


వేచి చూడాల్సింది!

‘‘హైకోర్టు జడ్జిలపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపే అధికారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉంది. ఆయన దీనిపై రహస్య విచారణ జరపవచ్చు. తాను చేసిన ఫిర్యాదుపై చీఫ్‌ జస్టిస్‌ స్పందన కోసం జగన్‌ వేచి చూడాల్సింది. కానీ... అలా చేయకుండా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఇందులో ఔచిత్యం ప్రశ్నార్థకం!’’

అరవింద్‌ దత్తర్‌, సీనియర్‌ న్యాయవాది


సుప్రీం తీర్పుకూ విరుద్ధమే!

భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను బహిర్గతం చేయడం... ప్రశాంత్‌ భూషణ్‌ కేసులో సుప్రీంకోర్టు తాజాగా వెలువరించిన ఆదేశాలను ఉల్లంఘించడమే! కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రశాంత్‌ భూషణ్‌ బహిరంగ ప్రకటన చేయడాన్ని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తప్పుపట్టింది. ‘కోర్టు నిర్ణయం వెలువడటానికి ముందుగానే, ఇలాంటి ప్రకటనను విడుదల చేయడం ఎంతమాత్రం సరికాదు. ఇది న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమే. మీడియా ద్వారా కోర్టు నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడమే’ అని తెలిపింది. 


కోర్టులను భయపెట్టేందుకే...

ప్రజాప్రతినిధులపై కేసులను సత్వరం పరిష్కరించాలంటూ... ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై సుప్రీంకోర్టు స్వీయ పర్యవేక్షణ చేస్తున్న సమయంలో... న్యాయ వ్యవస్థను భయపెట్టడానికే శనివారం ఏపీ ప్రభుత్వం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లుంది. ఆ ధర్మాసనం నుంచి జస్టిస్‌ రమణను తప్పించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరిగింది. న్యాయ వ్యవస్థను భయపెట్టి, దెబ్బతీయాలనే ఉద్దేశం కనిపిస్తోంది. అప్పటికే సీజేకు లేఖ రాసేశారు. న్యాయ వ్యవస్థపై  నమ్మకముంటే... తమ ఫిర్యాదుపై సీజే స్పందన కోసం వేచి చూసేవారు. ఇలా చేసేవారు కాదు!’’

విజయ్‌ హన్సారియా, సుప్రీంకోర్టు అమికస్‌ క్యూరీ

Updated Date - 2020-10-12T08:54:23+05:30 IST