బోస్‌, మోపిదేవి స్థానాల్లో.. మంత్రులుగా జోగి, పొన్నాడ?

ABN , First Publish Date - 2020-06-23T08:52:19+05:30 IST

రాజ్యసభకు ఎంపికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలతో మంత్రివర్గంలో ఏర్పడే

బోస్‌, మోపిదేవి స్థానాల్లో.. మంత్రులుగా జోగి, పొన్నాడ?

  • ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం!
  • రేసులో పార్థసారథి కూడా.. వైసీపీ వర్గాల్లో ప్రచారం


అమరావతి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు ఎంపికైన ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణారావు రాజీనామాలతో మంత్రివర్గంలో ఏర్పడే ఖాళీలను కృష్ణా జిల్లా పెడన శాసనసభ్యుడు జోగి రమేశ్‌, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్‌కుమార్‌లతో భర్తీ చేస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సీనియారిటీ, సామాజికవర్గాల ప్రాతిపదికన వీరిద్దరినీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఇప్పటికే ఎంపిక చేశారని పార్టీలో అంతర్గతంగా ప్రచారం జరుగుతోంది. రమేశ్‌, సతీ్‌షల రాజకీయ నేపథ్యంలో సారూప్యముందని చెబుతున్నారు. ఇద్దరూ 2009లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014లో రమేశ్‌ ఓటమిపాలయ్యారు.


అప్పట్లో పొన్నాడకు వైసీపీ టికెట్‌ దక్కలేదు. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ వైసీపీ తరపున ఎన్నికయ్యారు. మంత్రి పదవి రేసులో కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తనకు అవకాశం దక్కుతుందని ఆయన గట్టిగా నమ్ముతున్నట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే ఎస్‌.అప్పలరాజు పేరు కూడా వినిపించినా.. ఆయన మొదటిసారి గెలిచినందున అవకాశం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో.. మంత్రుల్లో 80 శాతం మంది రెండున్నరేళ్లు మాత్రమే ఉంటారని.. తర్వాతి రెండేళ్లలో మిగతా వారికి అవకాశమిస్తానని సీఎం జగన్‌ ప్రకటించారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్నవారు మరో ఏడాదిన్నర కాలం వేచి ఉండక తప్పదు.


అందుకే బోస్‌, మోపిదేవి స్థానాలపై ఎవరూ పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదు. ఇప్పుడు మంత్రి పదవి చేపట్టినా మరో ఏడాదిన్నర తర్వాత జరిగే మార్పుల్లో తమను తప్పించవచ్చన్న సందేహం కూడా వారిలో నెలకొంది. రాజ్యసభకు ఎంపికైన బోస్‌, మోపిదేవి వచ్చే నెల ఐదో తేదీలోగా ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి ఉందని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఆలోపే వారిద్దరితో మంత్రి పదవులకు రాజీనామా చేయించడం, కొత్తగా ఇద్దరిని చేర్చుకోవడం చకచకా జరిగిపోతాయని పార్టీ కీలక నేత ఒకరు వెల్లడించారు.

Read more