ఉద్యోగులంటే చిన్నచూపా?

ABN , First Publish Date - 2020-08-16T09:53:27+05:30 IST

కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కోతపెట్టిన జీతాలను 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.

ఉద్యోగులంటే చిన్నచూపా?

మా హక్కుల కోసం ఎటూ పోరాడరు 

ధర్మాసనం ఇచ్చినవీ కాలదన్నుతున్నారు 

కోర్టు తీర్పుపై అభ్యంతరాలు ఎందుకు?

నేతలుగా చలామణీ అవుతూ వంచన 

సంఘాల నేతలపై ఉద్యోగుల్లో అసంతృప్తి 


ప్రభుత్వం మనసెరిగి మసలుకోవడానికే ఉద్యోగ సంఘాలు ఉవ్విళ్లూరుతున్నాయా?... ప్రభుత్వం ఏం చెప్పినా పాటించే డూడూ బసవన్నలా మారిపోయాయా?... ప్రభుత్వ పెద్దల కన్నెర్రకు గురికాకుండా... ఉద్యోగుల ప్రయోజనాలను సైతం ఫణంగా పెట్టేందుకు సంఘాల నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా?... ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల నేతల వైఖరి చూస్తే ఇదే నిజమనిపిస్తోంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) :కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కోతపెట్టిన జీతాలను 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి చేసిన ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉద్యోగులకు కోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరతామని ఆయన చెప్పడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ సంఘం నేతగా తీర్పును హర్షించాల్సింది పోయి.. అభ్యంతరం వ్యక్తం చేయడమేంటని నిలదీస్తున్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమం గాలికొదిలి ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా స్పందించడం హేయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన వాటి కోసం కోర్టుకు వెళ్లినవారికి ఉద్యోగుల తరఫున సంఘ నేతలుగా కృతజ్ఞతలు తెలపాల్సింది పోయి.... ప్రభుత్వానికి అనుకూలంగా, ఉద్యోగులకు వ్యతిరేకంగా పోరాటం చేయడమేంటని పలువురు ఉద్యోగులు వెంకట్రామిరెడ్డి వైఖరిపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మీరెలాగూ ప్రభుత్వంపై పోరాడరు, కోర్టు నుంచి సాధించుకున్నవి కూడా దక్కనీయరా అని నిలదీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు నోరెత్తలేని పరిస్థితులు నెలకొన్నాయని, సమస్యలపై నోరెత్తినవారిని అణిచివేయడం, కేసులు పెట్టడం చేస్తున్నారని, అయినా సంఘాల నేతలు ప్రభుత్వంతో చేతులు కలిపి తమ గురించి పట్టించుకోవడం లేదని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగుల సమస్యలు పట్టించుకోని సంఘాలపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. 


కరోనా కారణంగా తెలంగాణ ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు 50శాతం జీతాలు మాత్రమే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం సైతం అదే బాటలో ఉద్యోగులు, పెన్షనర్లకు సగం జీతమే ఇచ్చింది. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కలిగినప్పటికీ కొవిడ్‌ నేపథ్యంలో ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత పలు సంక్షేమ కార్యక్రమాల అమల్లో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.వేల కోట్లు బదిలీ చేస్తుండటంతో ప్రభుత్వ వైఖరిపై కొంతమంది ఉద్యోగులు అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెబుతూనే, రూ.వేల కోట్లు ప్రజల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోందని వాపోతున్నారు. ఏ ప్రభుత్వమైనా ముందుగా ఉద్యోగుల జీతభత్యాలు పూర్తిగా ఇచ్చిన తర్వాతే ఇతర సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారిస్తుందని, విచిత్రంగా ఈ ప్రభుత్వం జీతాల్లో కోతలు పెడుతూ... సంక్షేమానికి నిధుల పంపిణీ చేపడుతోందని విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ నెల కూడా అందరు ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలిచ్చిన దాఖలాల్లేవని పలువురు ఉద్యోగులు ప్రైవేట్‌ సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. 


హామీలపై నిలదీయరేం?

ఉద్యోగులకు ఇప్పటివరకు 4 డీఏలు ఇవ్వలేదని, 2018నుంచి అమలు కావలసిన పే రివిజన్‌ను సాధించేందుకు సంఘ నేతలెవరూ కృషి చేయకుండా స్వలాభం కోసం ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ  సీపీఎస్‌ రద్దుచేస్తామని, సకాలంలో పీఆర్‌సీ అమలు చేస్తామని చెప్పిందని వాటి గురించి సంఘ నేతలు ఎందుకు ప్రశ్నించడంలేదని మండిపడుతున్నారు. తమకు జీతం మినహా మరే ఇతర సంక్షేమ పథకాలు తమకు వర్తించవని ఉద్యోగులు చెబుతున్నారు. పలు శాఖల్లో ఉద్యోగులు కరోనాను లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్న అంశం సంఘ నేతలకు కనిపించడం లేదా అని  ప్రశ్నిస్తున్నారు. సమస్యలపై మాట్లాడిన ఉద్యోగులపై అక్రమంగా ప్రభుత్వం కేసులు బనాయించినప్పుడు వారి తరపున సంఘ నేతలు ఎందుకు మాట్లాడలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

Updated Date - 2020-08-16T09:53:27+05:30 IST