సచివాలయాల్లో ఉద్యోగం.. పాపమా?

ABN , First Publish Date - 2020-09-01T09:56:47+05:30 IST

సరికొత్త పరిపాలనా వ్యవస్థ అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినవే... గ్రామ, వార్డు సచివాలయాలు! ప్రభుత్వ ఉద్యోగమంటూ వీటిల్లో చేరిన వారు మాత్రం నేడు

సచివాలయాల్లో ఉద్యోగం.. పాపమా?

  • వింత నిబంధనలతో సిబ్బంది లబోదిబో
  • ఉన్నత ఉద్యోగాలొచ్చి వెళ్తుంటే..
  • గౌరవ వేతనం తిరిగి ఇవ్వాల్సిందే!
  • అప్రెంటిస్‌ పూర్తికాక ముందే శాఖా పరీక్షలట!
  • ఇప్పటికే ఎంపికైన వారి నియామకం లేదు
  • వచ్చే నెలలో పరీక్షల నిర్వహణకు సన్నాహాలు 


అమరావతి, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సరికొత్త పరిపాలనా వ్యవస్థ  అంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టినవే... గ్రామ, వార్డు సచివాలయాలు! ప్రభుత్వ ఉద్యోగమంటూ వీటిల్లో చేరిన వారు మాత్రం నేడు లబోదిబోమంటున్నారు. వింత నిబంధనలు, ఆదేశాలను చూస్తున్న ఉద్యోగులు.. ఈ పోస్టుల్లో చేరడమే తాము చేసిన పాపమా? అని ఆవేదన చెందుతున్నారు. అసలు సచివాలయ వ్యవస్థ స్వరూపం ఏర్పడక ముందే ఉద్యోగులను ఎంపిక చేయడం, ఎంపిక చేసిన వారికి పోస్టింగులు ఇవ్వకపోవడం, ఉద్యోగంలో చేరిన వారికి సుదీర్ఘకాలం జాబ్‌చార్ట్‌ రూపొందించలేకపోవడం, జాబ్‌చార్ట్‌పై రోజుకో రకంగా ఉత్తర్వులు మార్చడంతో ఉద్యోగులు అయోమయానికి గురవుతున్నారు.


వాస్తవానికి ఈ ఉద్యోగాల్లో చేరిన వారిలో భారీ సంఖ్యలో ఉన్నత విద్యావంతులు ఉన్నారు. ప్రభుత్వం వీరికి రెండేళ్లపాటు అప్రెంటి్‌సషిప్‌ పేరుతో కేవలం రూ.15 వేలు గౌరవ వేతనం ఇస్తోంది. ఈ జీతం వారి రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం కష్టమే. తక్కువ జీతమే అయినా మంచి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకూ ఇందులో కొనసాగుదామన్న ఉద్దేశంతోనే పలువురు ఈ పోస్టుల్లో చేరారు. ఆ తర్వాత తమ విద్యార్హతకు తగినట్లు మెరుగైన ఉద్యోగం రావడంతో ఈ పోస్టులకు రాజీనామా చేస్తున్నారు. అయితే వీరికి ఇక్కడే కొత్త సమస్య వచ్చిపడింది! ఈ క్రమంలో అప్రెంటి్‌సషిప్‌ కాలంలో తాము తీసుకున్న గౌరవ వేతనం తిరిగి ఇవ్వాలన్న నిబంధనలు పాటించాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగం వదిలి వెళ్లేటప్పుడు అప్రెంటి్‌సషిప్‌ కాలంలో పొందిన వేతనాలు తిరిగి చెల్లించాలన్న నిబంధనలు ప్రభుత్వరంగంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ, ఎక్కడా పాటించిన దాఖలాల్లేవు. ఈ సందర్భం చాలా అరుదుగా ఉంటుంది. కానీ ప్రభుత్వం తమ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తుండడంతో అప్పు చేసి మరీ తిరిగి చెల్లించాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు... అప్రెంటి్‌సషిప్‌ పూర్తి కాకముందే తమను డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు రాయాల్సిందేననడంపైనా ఆందోళన చెందుతున్నారు. 


మళ్లీ నోటిఫికేషనా?

మరి కొంతమంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఇంకో రకంగా ఉంది. సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైనప్పటికీ పలువురికి నియామకపత్రాలు ఇవ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. సచివాలయ రాత పరీక్షల్లో అర్హత సాధించి, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తయినప్పటికీ పలువురు అభ్యర్థులకు నియామకపత్రం ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయం కోసం వీరంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారు వేలమంది ఉన్నప్పటికీ వాటిపై ఎలాంటి స్పష్టతా లేకపోవడంతో తమకు ఉద్యోగాలు వస్తాయా?.. రావా? అని ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఖాళీ పోస్టుల భర్తీకి రెండో విడత నోటిఫికేషన్‌ ఇవ్వడం, సెప్టెంబరు 20 నుంచి పరీక్షల నిర్వహణకు సన్నాహాలు చేస్తుండడంతో ఈ అభ్యర్థుల్లో ఆందోళన మరింతపెరిగింది.


పలు కారణాలతో ఖాళీ అయిన స్థానాలను తొలి విడత పరీక్షల్లో అర్హత సాధించి మెరిట్‌ జాబితాలో ఉన్న వారితో, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తి అయిన అభ్యర్థులతో భర్తీ చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా ప్రభుత్వం కొత్తగా నోటిఫికేషన్‌ ఇచ్చింది.  అదనంగా ప్రభుత్వం ప్రకటించిన 3వేల పోస్టులను మొదటి నోటిఫికేషన్‌లో అర్హత సాధించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులతో భర్తీ చేయకుండా పోస్టులు మిగిలిపోయాయన్న కారణంతో రెండో నోటిఫికేషన్‌ ఇవ్వడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-09-01T09:56:47+05:30 IST