-
-
Home » Andhra Pradesh » Janata curfew Lockdown Coronavirus
-
లాక్‌డౌన్ తక్షణమే అమల్లోకి
ABN , First Publish Date - 2020-03-23T10:39:22+05:30 IST
రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైర్‌సను నిరోధించేందుకు, గాలి ద్వారా, మనిషి నుంచి మనిషికి వ్యాప్తిచెందకుండా

ఈ నెలాఖరుదాకా వర్తింపు
కలెక్టర్లకు సర్కారు ఆదేశం.. ఇది హెల్త్ ఎమర్జెన్సీయే?
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో లాక్‌డౌన్ ప్రకటిస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వైర్‌సను నిరోధించేందుకు, గాలి ద్వారా, మనిషి నుంచి మనిషికి వ్యాప్తిచెందకుండా నియంత్రించడానికి, కొత్త ప్రాంతాల్లో వ్యాధి ప్రబలకుండా తక్షణమే లాక్‌డౌన్ అమలవుతుందని పేర్కొంది. అంటువ్యాధుల చట్టం-1897 ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నియమావళి అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో 209ని జారీచేశారు. ఈనెల 31దాకా ఇది కొనసాగుతుందని తెలిపారు. తాజా ఆదేశాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, వైద్య, ఆరోగ్యశాఖ, ఇతర నోడల్ అధికారులు తక్షణమే రంగంలోకి దిగి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, వ్యాధి ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లాక్‌డౌన్ ప్రకటించినందున వైరస్ ప్రబలకుండా, ముందస్తు చర్యల్లో భాగంగా తక్షణ వైద్య సంరక్షణ వ్యూహాలను అమలు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
కలెక్టర్లు, జేసీలకు పూర్తి అధికారాలు..
కాగా.. ఈ లాక్‌డౌన్‌కు, ఆరోగ్య అత్యవసర పరిస్థితి (హెల్త్ ఎమర్జెన్సీ)కి పెద్దగా తేడా ఏమీలేదు. ఇప్పటికే అంటువ్యాధుల చట్టం-1897కి కొన్ని నిబంధనలు జోడించి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పుడు పూర్తిగా హెల్త్ ఎమర్జెన్సీ పరిధిలోకి తీసుకొచ్చింది. దీనిప్రకారం వైరస్ నివారణకు కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికార్లకు పూర్తి అధికారాలు కల్పించింది. నిజానికి ఆదివారం జనతా కర్ఫ్యూ మొత్తం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని తలపించింది. ప్రజలంతా స్వచ్ఛందంగా ఇంటిలో నుంచి బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించారు. ఇదే తరహాలో ఈ నెలా 31వ తేదీ వరకూ కొనసాగించాలని ప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించింది. అంటే పూర్తి స్థాయి హెల్త్ ఎమర్జెన్సీ తరహాలో నిబంధనలు అమల్లోకి వచ్చినట్లేనని ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.