-
-
Home » Andhra Pradesh » Janata curfew DGP Gautam Sawang
-
విదేశీ ప్రయాణికులపై నిఘా
ABN , First Publish Date - 2020-03-23T09:23:57+05:30 IST
రాష్ట్రానికి ఇప్పటి వరకు 12వేల మంది విదేశీ ప్రయాణికులు వచ్చారని, వారందరిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.

స్వచ్ఛంద పరీక్షలు చేయించుకోవాలి
ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు : డీజీపీ
అమరావతి/విజయవాడ, మార్చి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఇప్పటి వరకు 12వేల మంది విదేశీ ప్రయాణికులు వచ్చారని, వారందరిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. జనతా కర్ఫ్యూను ప్రజలంతా స్వచ్ఛందంగా విజయవంతం చేశారని చెప్పారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘విదేశాల నుంచి వచ్చేవారిపై గట్టి నిఘా ఏర్పాటు చేయండి... ఐసోలేషన్ వార్డుకు తరలిస్తారని కొందరు వాస్తవాలు చెప్పడంలేదు... అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి’ అని జిల్లాల ఎస్పీలు, విజయవాడ, విశాఖ పోలీసు కమిషనర్లను డీజీపీ ఆదేశించారు. ప్రజలు కూడా సమాజ శ్రేయస్సు దృష్టా సహకరించాలని, విదేశాల నుంచి వచ్చేవారి వివరాలు పోలీసులకు తెలియజేయాలని కోరారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై విమానాశ్రయాల నుంచి రాష్ట్రంలోకి వచ్చేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షలు జరగకుండా రానివ్వద్దని ఆదేశించారు. అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంతో ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి వచ్చేవారు స్వచ్ఛందంగా వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల విమానాశ్రయాల్లో దిగి నేరుగా ఇళ్లకు చేరుకునేవారిపై, ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లేలా వ్యవహరించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.