ఇకపై ప్రతి గ్రామంలో జనతా బజార్: కన్నబాబు

ABN , First Publish Date - 2020-04-25T03:22:32+05:30 IST

ఇకపై రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, వినియోగదారుల కోసం జనతా బజారులు ఉంటాయని మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం వ్యవసాయ శాఖపై

ఇకపై ప్రతి గ్రామంలో జనతా బజార్: కన్నబాబు

అమరావతి: ఇకపై రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు, వినియోగదారుల కోసం జనతా బజారులు ఉంటాయని మంత్రి కన్నబాబు తెలిపారు. శుక్రవారం వ్యవసాయ శాఖపై సీఎం జగన్ సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కన్నబాబు.. జనతా బజార్ ద్వారా రైతులకు సెల్ పాయింట్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు వెల్లడించారు. దీని ద్వారా బలమైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పడుతుందన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని సీఎం ఆదేశించారన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున పంటలను కొనుగోలు చేసిందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా వ్యవసాయ మార్కెటింగ్‌పై సీఎం ఫోకస్ చేస్తున్నారని మంత్రి కన్నబాబు చెప్పుకొచ్చారు. శనివారం నుంచి రైతులకు నమోదు కూపన్లు అందిస్తున్నామని చెప్పారు. ఆ కూపన్ల ఆధారంగా పంట కొనుగోలు చేస్తామన్నారు. ఒకవేళ మద్దతు ధర కంటే అధిక ధర వస్తే రైతులు తమ పంటను బయట అమ్ముకోవచ్చునని మంత్రి సూచించారు. నిబంధనలను పక్కనపెట్టి తడిచిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేయమని సీఎం ఆదేశించారని కన్నబాబు తెలిపారు. అధికారిక సమాచారం ప్రకారం కేవలం 25శాతం మార్కెట్లు మాత్రం పనిచేస్తున్నాయని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా.. మే 15కు రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రైతులకు ఒక గ్రేడింగ్ మరియు ప్యాకింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.

Updated Date - 2020-04-25T03:22:32+05:30 IST