కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

ABN , First Publish Date - 2020-08-01T09:48:35+05:30 IST

‘‘ప్రకాశం జిల్లా కురిచేడులో కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

  • ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలి
  • బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి
  • జనసేనాని పవన్‌ కల్యాణ్‌, సీపీఐ రామకృష్ణ డిమాండ్‌

అమరావతి, న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): ‘‘ప్రకాశం జిల్లా కురిచేడులో కల్తీ మద్యం మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి. మద్యం నిషేధించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’’ అంటూ జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేర్వేరు ప్రకటనలో విమర్శించారు. ‘‘మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో నాటుసారా ఏరులై పారుతున్నా నిర్లిప్తంగా వ్యవహరిస్తోంది.  శానిటైజర్లు తాగి మృతి చెందినవారి కుటుంబాలకు ప్రభుత్వం తగిన సాయం అందించాలి. ఆసుపత్రిలో చేరిన వారికి మెరుగైన వైద్య సాయం ఇవ్వాలి’’ అని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ విఫలమైందనడానికి ప్రకాశం జిల్లా కురిచేడు ఘటన తార్కాణం. కురిచేడు మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో మద్యం మాఫియా కనుసన్నల్లో అక్రమ మద్యం రవాణా, బ్లాక్‌ మార్కెటింగ్‌ విపరీతంగా జరుగుతోంది’’ అని సీపీఐ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. 


కల్తీ మద్యంతో మరణాలు దురదృష్టకరం: రఘురామ

రాష్ట్రంలో కల్తీ మద్యం తాగి పలువురు మరణించడం దురదృష్టకరమని రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించారు. పేరున్న మద్యం బ్రాండ్లు అనేకం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎందుకు అందుబాటులో ఉండటంలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఈ అంశంపై సీఎం జగన్‌ సమీక్షించాలని కోరారు. అమ్మఒడి డబ్బంతా నాన్న ఒడిలోకి వెళ్లిపోతోందన్నారు. అదే డబ్బు మద్యం రూపంలో మళ్లీ మీ వద్దకే వస్తున్నందుకు ఆనందపడుతున్నారా?అని ఆయన సీఎంను ప్రశ్నించారు.

Updated Date - 2020-08-01T09:48:35+05:30 IST