వైద్య ఆరోగ్య సిబ్బందికి జీతాలు చెల్లించండి: జనసేన
ABN , First Publish Date - 2020-09-14T21:39:08+05:30 IST
కరోనా విధుల్లో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
అమరావతి: కరోనా విధుల్లో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుండటం దురదృష్టకరమని జనసేన పీఎసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులతో పాటు ఇతర సిబ్బందికి గత రెండు నెలలకు జీతాలు చెల్లించడం లేదు. నెలవారీ జీతం చెల్లింపులకూ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ దృష్టికి ఇప్పటికే ఈ సమస్య చేరింది. ఈ విధుల కోసమే 1170 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 1170 మంది మెడికల్ ఆఫీసర్లను, 2 వేల మంది నర్సులను, 1200కి పైగా పారా మెడికల్, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమించుకుంది. అదే విధంగా 1700 మంది ఆరోగ్య కార్యకర్తలకీ జీతాలు అందటం లేదు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వకుండా తాత్సారం చేయడాన్ని జనసేన పార్టీ ఖండిస్తుంది. కరోనా విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బందికి తక్షణమే బకాయి ఉన్న జీతాలు చెల్లించాలి’ అని ప్రభుత్వాన్ని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.