-
-
Home » Andhra Pradesh » Janasena chief Pawan Kalyan
-
తుపాన్‌తో నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలి: పవన్
ABN , First Publish Date - 2020-11-27T22:01:22+05:30 IST
నివర్ తుపాన్‌తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు

అమరావతి: నివర్ తుపాన్‌తో రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోవడం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ‘సుమారు రూ.వెయ్యి కోట్ల మేర పంట నష్టం జరిగినట్లు సమాచారం. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి విపత్తుతో రైతాంగం దెబ్బతింది. నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో రైతులకు ఏమీ మిగిలే పరిస్థితి కనిపించడం లేదు. రైతులను అన్ని విధాలా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. అప్పుల పాలైపోతున్న రైతులను మరింత కుంగదీసే విధంగా ఈ నష్టాలు ఉన్నాయి. పెట్టుబడి రాయితీతో పాటు పంటల బీమాను సకాలంలో అందించాలి’ అని కోరారు.
‘గతేడాది ఖరీఫ్, రబీ పంటల నష్టానికి సంబంధించిన బీమా మొత్తాలు ఇప్పటికీ రైతులకు అందలేదు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ తగిన విధంగా స్పందించాలి. నివర్ తుపాన్ కంటే ముందు భారీ వర్షాలు, వరదల మూలంగా రైతాంగం నష్టపోయింది. ఇప్పుడు నివర్ మరింత దెబ్బ తీసింది. పంటలు కోల్పోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ఉచితంగా అందచేస్తే చాలు వ్యవసాయం చేసేవారికి ధీమా కలుగుతుంది. నివర్ తుపాన్ మూలంగా ఇళ్ళల్లోకి నీళ్ళు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. నిరాశ్రయులుగా మిగిలిన వారిని తక్షణమే ఆదుకొనే చర్యలను ప్రభుత్వం చేపట్టి బాధితులకు ఉపశమనం కలిగించాలి. రాబోయే కొద్ది రోజుల్లో మరో తుపాన్ పొంచి ఉందని తెలుస్తోంది. ప్రజలను ముందుగా అప్రమత్తం చేసే చర్యల్లో జనసైనికులు భాగస్వాములు కావాలి’ అని పవన్‌కల్యాణ్ విజ్ఞప్తి చేశారు.