2022లో జమిలి ఎన్నికలు
ABN , First Publish Date - 2020-10-03T07:18:06+05:30 IST
లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు 2022లో వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.

నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి..
దోపిడీ పాలనను చూస్తూ ఊరుకోం
కరోనా తర్వాత రాష్ట్రమంతా తిరుగుతా:చంద్రబాబు
అమలాపురం లోక్‌సభ నేతలతో ఆన్‌లైన్ భేటీ
అమరావతి, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి జమిలి ఎన్నికలు 2022లో వస్తాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. శుక్రవారం అమలాపురం లోక్‌సభ స్థానం పరిధిలోని టీడీపీ నేతలతో ఆయన ఆన్‌లైన్ సమావేశం నిర్వహించారు. ‘కరోనా కాలంలో వ్యాధులు పెరిగి.. ఆదాయాలు పడిపోయి ప్రజలు సతమతమవుతుంటే వారిని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది.
జేబులు నింపుకొనే పనిలో పడింది. ఈ దోపిడీ పాలనను చూస్తూ ఊరుకోం. కరోనా పోయిన తర్వాత నేను రాష్ట్రమంతా తిరిగి ప్రజలను కలుస్తాను. కష్టాల్లో ఉన్నవారి కోసం గళం విప్పుతాను. వారి తరపున పోరాడతాను. వైసీపీది అరాచక పాలన. రాష్ట్రంలో దళితులపై దాడులు జరగని రోజంటూ లేదు. ఒక న్యాయమూర్తి సోదరుడిని కొట్టినా న్యాయం జరగకపోతే చలో మదనపల్లికి పిలుపిచ్చిన దళిత నేతలను అరెస్టులు చేశారు. విజయవాడలో దళితయువకుడిని పోలీసులు లాక్‌పలో కొట్టి చంపడం దారుణం.
బెంజికార్లు బహుమతులుగా పుచ్చుకున్న మంత్రులు దర్జాగా తిరుగుతున్నారు. దళితులు, సా మాన్యులను పోలీసులు ప్రాణాలు తీసేస్థాయిలో హింసిస్తున్నారు. మహాత్ముడు కోరిన రాజ్యం ఇదేనా?’ అని వ్యాఖ్యానించారు. కాగా, కరోనా ఉధృతి సమయంలో సామాజిక బాధ్యతగా టీడీపీ తరపున వెబ్‌సైట్ ప్రారంభిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.
మూల్యం తప్పదు..
టీడీపీ కార్యకర్తలను వేధించిన వారు భవిష్యత్‌లో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ‘మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ నిజస్వరూపం ఏమిటో ప్రజలకు అర్థమవుతోంది. ఇంకా భ్రమల్లో ఉన్నవారికి వాస్తవాలు ఏమిటో పార్టీ కార్యకర్తలు విడమర్చి చెప్పాలి. పార్టీ కమిటీలను బలోపేతం చేస్తున్నాం. బీసీ, బడుగు వర్గాల వారికి పెద్ద పీట వేస్తున్నాం. కొత్త రక్తం ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నాం.
మంచి నాయకత్వాన్ని తీర్చిదిద్దే శక్తి టీడీపీకే ఉంది. అందుకే ఇవాళ తెలంగాణ మంత్రివర్గం మొత్తం టీడీపీ వారితో నిండిపోయి ఉంది. గతంలో కొన్ని తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటాం. పనిచేసే వారికే ప్రాధాన్యం. మనపై బురదజల్లి కాలక్షేపం చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది’ అని దుయ్యబట్టారు.