జగనన్నా.. ఇదేనా న్యాయం
ABN , First Publish Date - 2020-10-03T07:26:45+05:30 IST
‘‘జగనన్నా.. నా బిడ్డకు న్యాయం చేస్తానంటివి. అత్యాచారం, హత్యకు గురైన నా కుమార్తె సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు పురోగతి లేదు.

నాటి నీ హామీలు ఏమయ్యాయి?.. సుగాలి ప్రీతి తల్లి సూటి ప్రశ్నలు
మదనపల్లె టౌన్, అక్టోబరు 2: ‘‘జగనన్నా.. నా బిడ్డకు న్యాయం చేస్తానంటివి. అత్యాచారం, హత్యకు గురైన నా కుమార్తె సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు పురోగతి లేదు. ఇదేనా నీ పాలన? నాటి నీ హామీలు ఏమయ్యాయి?’’ అని కర్నూలుకు చెందిన సుగాలి పార్వతీదేవి ధ్వజమెత్తారు. శుక్రవారం ‘చలో మదనపల్లె’ కార్యక్రమానికి కర్నూలు నుంచి ఆలస్యంగా చేరుకున్న ఆమె స్థానిక బీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
2017లో తన కుమార్తె సుగాలి ప్రీతి(14)ని ఆమె చదువుతున్న పాఠశాల యజమాన్యంలోని కొందరు అత్యాచారం చేసి, ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తెలిపారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ కర్నూలు చేరుకుని నిరసన ర్యాలీ చేపట్టడంతో కేసు నమోదు చేశారని చెప్పారు. అప్పట్లో కర్నూలుకు పాదయాత్రగా వచ్చిన వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి గోడు వెళ్లబోసుకుంటే, పార్టీ అధికారంలోకి రాగానే ప్రీతి చదివిన స్కూలు మూసివేయిస్తామని, కేసును సీబీఐకి అప్పగించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
అయితే ఆయన సీఎంగా అధికారం చేపట్టి ఏడాదిన్నర గడిచినా ఇంతవరకు ఈ కేసులో పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులకు ఫోన్ చేసి అడుగుతుంటే, కేసు తమ వద్దకు రాలేదని చెబుతున్నారని అన్నారు. దీంతో ‘చలో మదనపల్లె’కు వచ్చామన్నారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్‌కుమార్, గిరిజన నాయకులు సుగాలి రాజునాయక్ తదితరులు పాల్గొన్నారు.