జగన్‌కు హిట్లర్‌ గతే!

ABN , First Publish Date - 2020-03-19T09:00:08+05:30 IST

‘ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, వారి తీర్పును వమ్ముచేసే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ హింసాత్మక చర్యలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం...

జగన్‌కు హిట్లర్‌ గతే!

  • బీజేపీ నేతలపై దాడులకు తెగబడతారా?
  • కన్నాపై నోరుపారేసుకుంటారా?:  సుజనాచౌదరి ఆగ్రహం


న్యూఢిల్లీ, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ‘ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే, వారి తీర్పును వమ్ముచేసే విధంగా ముఖ్యమంత్రి జగన్‌ హింసాత్మక చర్యలు, అరాచకాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రత్యర్థులు, విపక్షాల అభ్యర్థులపై దాడులు చేస్తూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.  ముఖ్యమంత్రిగా ఫ్యాక్షనిస్టుగా వ్యవహరిస్తూ.. ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ ...కులాలు, మతాలు, ప్రాంతాల పేరిట రాష్ట్రంలో చిచ్చు రేపుతున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుంది‘ అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి విరుచుకుపడ్డారు. బుధవారం ఢిల్లీలోని తన అధికార నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని, పోలీసులను అడ్డంపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, నామినేషన్లు వేయకుండా ప్రత్యర్థులను అడ్డుకుని అక్రమంగా ఏకగ్రీవాలు చేసుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కూడా ఈ అరాచకాలను చూస్తూ ఏమీ చేయలేకపోవడం శోచనీయమన్నారు.


‘దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తీరుపై ప్రజలు భయభ్రాంతులవుతున్న తరుణంలో కేంద్రం కరోనా వైర్‌సను జాతీయ విపత్తుగా ప్రకటించినప్పటికీ ముఖ్యమంత్రి మాత్రం కరోనాను తేలిగ్గా కొట్టిపడేయడం విడ్డూరంగా ఉంది. జనం ప్రాణాలంటే మీకంత చులకనా? కరోనా వ్యాధి కారణంగానే ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ఎస్‌ఈసీ ప్రకటిస్తే.. ప్రభుత్వం దీనిపై హైకోర్టును కాదని, సుప్రీంకోర్టుకు వెళ్లడం ఆశ్చర్యకరం. అంటే హైకోర్టుపై ఈ సీఎంకు నమ్మకం లేదన్నమాట! కమిషనర్‌కు కులం ఆపాదించిన సీఎం.. ఇప్పుడు సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తికి కూడా కులం ఆపాదిస్తారా? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై వైసీపీ నేతలు నోరుపారేసుకుంటారా? దివంగత వైఎస్సార్‌కు ఆయన గతంలో ఎంతో సన్నిహితుడు కాదా? ఆయన మంత్రిమండలిలో మంత్రిగా ఉన్నమాట మరిచారా? సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కన్నాపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం మానుకోకపోతే తీవ్రపరిణామాలు ఎదురవుతాయి’ అని హెచ్చరించారు.Updated Date - 2020-03-19T09:00:08+05:30 IST