మద్యపాన నిషేధంలో భాగంగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2020-05-09T22:51:08+05:30 IST

మద్యపాన నిషేధంలో భాగంగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

మద్యపాన నిషేధంలో భాగంగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం

అమరావతి : మద్యపాన నిషేధంలో భాగంగా జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశల వారిగా మద్యపానం నిషేధించాలని నిర్ణయించింది. గతంలో 20శాతం షాపులు తగ్గించిన ప్రభుత్వం తాజాగా మరో 13 శాతం షాపులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే తాజా నిర్ణయంతో మొత్తం 33శాతం షాపులు తగ్గాయన్న మాట. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


మూసేయాలంటూ ఆదేశాలు..

అయితే తాజాగా.. షాపుల సంఖ్యను 2,934కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుకు ఈ మొత్తం షాపులను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 43 వేల బెల్టు షాపులను ప్రభుత్వం తొలగించింది. మొత్తం 40 శాతం బార్లు తగ్గిస్తూ గతంలోనే జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దశలవారి మద్యపాన నిషేధంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది.


పడిపోతున్న మద్యం అమ్మకాలు..

ఇదిలా ఉంటే రాష్ట్రంలో రోజురోజుకూ మద్యం అమ్మకాలు పడిపోతున్నాయి. పెరుగుతున్న ధరలు, తగ్గిన షాపులే కారణమని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత పునఃప్రారంభమైన తొలి రోజు రూ.68కోట్ల అమ్మకాలు జరగ్గా.. రెండోరోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమవడంతో రూ.28కోట్ల అమ్మకాలు జరిగాయి. మూడోరోజు మాత్రం రూ.47కోట్లు, నాలుగోరోజు రూ.39కోట్లు, ఐదోరోజు రూ.38కోట్లు ఆదాయం వచ్చిందని ఎక్సైజ్‌ వర్గాలు చెబుతున్నాయి. ధరల పెంపుతో సరిహద్దు గ్రామాలకు తెలంగాణ నుంచి మద్యం సరఫరా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. మద్యం ధరలు పెరగడంతో గ్రామీణులు నాటుసారాకు అలవాటు పడుతున్నారు. దీంతో నాటుసారా, గుడుంబాను అరికట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

Updated Date - 2020-05-09T22:51:08+05:30 IST