జగన్‌ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమే

ABN , First Publish Date - 2020-02-08T10:01:48+05:30 IST

‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడోనేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడు. కానీ ఆయనలో క్షమ, దయా గుణం ఉండడంతో ఎన్ని కుట్రలు చేస్తున్నా చూస్తూ ఉన్నాం’’

జగన్‌ మూడో కన్ను తెరిస్తే చంద్రబాబు భస్మమే

దమ్ముంటే కొత్త పార్టీ పెట్టి గెలవండి: అనిల్‌

నంద్యాల, ఫిబ్రవరి 7: ‘‘సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడోనేత్రం తెరిస్తే చంద్రబాబు భస్మం అవుతాడు. కానీ ఆయనలో క్షమ, దయా గుణం ఉండడంతో ఎన్ని కుట్రలు చేస్తున్నా చూస్తూ ఉన్నాం’’ అని మంత్రి అనిల్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో బహిరంగ సభలో మాట్లాడుతూ రాయలసీమ పౌరుషం, రక్తం చంద్రబాబులో గానీ, బాలకృష్ణలో గానీ ఉంటే ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీని పక్కన పెట్టి.. దమ్ముంటే కొత్తగా పార్టీపెట్టి గెలవాలని సవాల్‌ చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్న చంద్రబాబు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్‌ బొమ్మ లేకుంటే ఆ పార్టీకి డిపాజిట్లు రావని ఎద్దేవా చేశారు. పదేళ్ల కష్టంతో, ప్రజల ఆదరాభిమానాలతో, 3వేల కిలోమీటర్ల పాదయాత్రతో, 151 సీట్లు గెలిచిన వైసీపీని గాలిలో కలుపుతారా? అంటూ చంద్రబాబుపై మంత్రి మండిపడ్డారు. జోలె పట్టుకొని అడుక్కోవడం చంద్రబాబుకు తెలుసుకానీ.. ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌పై మాట్లాడే దమ్ములేదని, బీజేపీతో బాబు సత్సంబంధాలను కలిగి ఉన్నారన్నారు. సీఎం జగన్‌ను విమర్శిస్తే ఊరుకో బోమని, తామంతా జగన్‌ భక్తులమని మంత్రి అన్నారు. 

Updated Date - 2020-02-08T10:01:48+05:30 IST