పారాసిటమాల్: కేసీఆర్ మాట.. జగన్‌ నోట

ABN , First Publish Date - 2020-03-15T21:21:19+05:30 IST

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే మాట ఒకే బాటలో నడుస్తున్నట్లు ఉన్నారు. అంతేకాదు ఇద్దరూ ఒకే పల్లవి అందుకున్నారు. కరోనాను నివారించేందుకు కేవలం ఓ చిన్న మాత్ర వేసుకుంటేచాలని ఇద్దరు సీఎంలు చెబుతున్నారు.

పారాసిటమాల్: కేసీఆర్ మాట.. జగన్‌ నోట

అమరావతి: తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే మాట ఒకే బాటలో నడుస్తున్నట్లు ఉన్నారు. అంతేకాదు ఇద్దరూ ఒకే పల్లవి అందుకున్నారు. కరోనాను నివారించేందుకు కేవలం ఓ చిన్న మాత్ర వేసుకుంటేచాలని ఇద్దరు సీఎంలు చెబుతున్నారు. కరోనా వస్తే పారాసిటమాల్ వేస్తే సరిపోతుందని సీఎం జగన్ చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసుల్లో 81 శాతం ఇంట్లో ఉంటూ రికవరీ అయ్యారని, కేవలం 13 శాతం మాత్రమే ఆస్పత్రుల్లో చేరారని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఎయిర్‌పోర్టులు, పోర్టుల్లో ప్రయాణికులను స్క్రీనింగ్ చేస్తున్నట్లు తెలిపారు. తప్పని సరైతేనే ప్రయాణాలు చేయాలని, షాపింగ్ మాల్స్‌, థియేటర్లు తప్పనిసరి అనుకుంటేనే వెళ్లాలని  సీఎం సూచించారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందన్నారు. ఏపీలో 70 మంది శాంపిల్స్‌ తీసుకుంటే ఒకటే పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. కరోనా పరీక్షల కోసం విజయవాడ, తిరుపతిలో ల్యాబ్‌లు సిద్ధం చేశామని తెలిపారు. కాకినాడ ప్రాంతంలో మరో ల్యాబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హోమ్ ఐసోలేషన్‌ను కూడా మానిటరింగ్ చేస్తున్నామని, విశాఖలో మాత్రమే క్వారంటైల్ ఆస్పత్రి ఉందన్నారు. విశాఖలో 300 బెడ్లు.. విజయవాడలో 50 బెడ్లు సిద్ధం చేశామన్నారు. నెల్లూరు కరోనా పాజిటివ్ కేసు బయటపడగానే కిలో మీటర్ చుట్టూ 20 వేల ఇళ్లకు టీమ్‌లు వెళ్లాయని, ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని మానిటర్ చేశామని జగన్ చెప్పారు.


ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో కరోనా నివారణపై ప్రతిపక్షాలు సంధించిన ప్రశ్నలకు  సీఎం కేసీఆర్ కూడా ఇలానే సమాధానం చెప్పారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, జ్వరం వచ్చినప్పుడు సాధారణంగా వేసుకునే పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పారు. రాష్ట్రానికి కరోనా వైరస్ రాదని, తాము ఆ వైరస్‌ను రానివ్వమని స్పష్టం చేశారు. 22 డిగ్రీల ఉష్టోగ్రత దాటితే కరోనా వైరస్ బతకలేదన్నారు. తెలంగాణలో ఉష్ణోగ్రత ఇప్పటికే 30 డిగ్రీలు దాటుతోందని కేసీఆర్ వివరించారు. 
Updated Date - 2020-03-15T21:21:19+05:30 IST