అసమర్థత.. అహంభావానికి ప్రతిబింబం జగన్‌

ABN , First Publish Date - 2020-12-10T09:31:32+05:30 IST

‘‘సీఎం జగన్‌ అసమర్థత, అహంభావం, నిర్లక్ష్యానికి ప్రతిబింబం. జగన్‌ ఫేక్‌ సీఎం. గాలి మాటలు, గాలి చేష్టలు తప్ప... ప్రజలకు చేసిందేమీ లేదు. 18 నెలల పాలనలో దళితులపై వేధింపులు పెరిగిపోయాయి

అసమర్థత.. అహంభావానికి ప్రతిబింబం జగన్‌

గాలి మాటలు, గాలి చేష్టలు తప్ప చేసిందేమీ లేదు

వైసీపీ ఫేక్‌ పార్టీ... ఫేక్‌ ముఖ్యమంత్రి

పులివెందులలో దళిత మహిళపై 

హత్యాచారంపై విచారణ ఏదీ?: చంద్రబాబు


కడప, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం జగన్‌ అసమర్థత, అహంభావం, నిర్లక్ష్యానికి ప్రతిబింబం. జగన్‌ ఫేక్‌ సీఎం. గాలి మాటలు, గాలి చేష్టలు తప్ప... ప్రజలకు చేసిందేమీ లేదు. 18 నెలల పాలనలో దళితులపై వేధింపులు పెరిగిపోయాయి. ప్రతి చోటా వైసీపీ దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి’’ అని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విమర్శించారు. బుధవారం కడప పార్లమెంట్‌ నియోజకవర్గ నాయకులతో జూమ్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ‘‘ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో దళిత మహిళను దారుణంగా మానభంగం చేసి, చంపేసినా కనీసం విచారణ చేయలేదంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో ఇట్టే తెలుస్తోంది. చట్టాన్ని వైసీపీ నేతలు చేతుల్లోకి తీసుకుంటే, ఏదో ఒక రోజు మూల్యం చెల్లించక తప్పదు.


ఆస్తులను ధ్వంసం చేసే దుష్ట సంస్కృతిని తీసుకొచ్చారు. కోర్టులు, న్యాయమూర్తులపైన విషం కక్కుతున్నారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు’’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘పంట నష్టం జరిగాక బీమా ప్రీమియం విడుదల చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనైనా జరిగిందా? చనిపోయాక బీమా చేస్తే పరిహారం ఎలా వస్తుంది? విశ్వసనీయత లేని, ఫేక్‌ పార్టీ వైసీపీ. పది ఓట్లలో ఐదు మారితే జగన్‌ ఇంటికి వెళ్లడమే. వైసీపీ అండతో పోలీసులు తప్పు చే స్తే, రాబోయే రోజుల్లో వారికి శిక్ష పడేదాకా వదలం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2020-12-10T09:31:32+05:30 IST