జగన్‌ ఫేక్‌ సీఎం

ABN , First Publish Date - 2020-12-01T08:52:39+05:30 IST

జగన్‌ ‘ఫేక్‌ సీఎం.. తప్పుడు మనుషులు.. తప్పుడు ప్రభుత్వం. తుఫాన్లు, వరదల దెబ్బకు జీవితాలు అతలాకుతలమై రైతులు అల్లాడుతుంటే గాలి మాటలు, సొల్లు కబుర్లు చెప్పి

జగన్‌ ఫేక్‌ సీఎం

తప్పుడు మనుషులు.. తప్పుడు ప్రభుత్వం

ఒక ఉన్మాదికి పది మంది ఉన్మాదులు తోడు

బుల్లెట్‌ బాగా దిగిందా అని నన్ను హేళన చేస్తారా?

ఈ సీఎంకు ఇంగిత జ్ఞానం ఉందా.. సైకోనా?

బీమా సొమ్ము కట్టకుండా రైతులను ముంచేశారు

మీ చేతగానితనానికి వారు మూల్యం చెల్లించాలా?

అసెంబ్లీలో వెకిలి చేష్టలు చేస్తున్నారు.. 

టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్‌


ప్రజలు ఏ పూనకంలో ఓటు వేశారో తెలియదు గానీ.. రాష్ట్రం కోసం ఇంత శ్రమ చేసి ఇప్పుడు వీళ్లతో బుల్లెట్‌  బాగా దిగిందా అని హేళన చేయించుకోవాల్సి వస్తోంది. ఈ ముఖ్యమంత్రికి కనీస ఇంగిత జ్ఞానం ఉందా.. లేక సైకోనా అని అనుమానం వస్తోంది.


విద్యుత్‌ పీపీఏలపై ప్రశ్నిస్తున్నారని మీడియాపై కోపం. అసెంబ్లీకి రావద్దని మూడు చానళ్లపై ఆంక్షలు. మేం అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ టీవీని ఇలాగే ఆపామా?


పోలీసులను పెట్టుకుని ఇష్టానుసారం బెదిరింపులు, కేసులు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు వదలరు.. మేమూ వదలం. 

చంద్రబాబు 


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ‘ఫేక్‌ సీఎం.. తప్పుడు మనుషులు.. తప్పుడు ప్రభుత్వం. తుఫాన్లు, వరదల దెబ్బకు జీవితాలు అతలాకుతలమై రైతులు అల్లాడుతుంటే గాలి మాటలు, సొల్లు కబుర్లు చెప్పి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. ఉన్మాదం ఆవహించి అసెంబ్లీలో వెకిలి చేష్టలు తప్ప.. రైతులు, వారి సమస్యలపై కనీస బాధ్యత లేని దిగజారుడు మనుషులు వీరు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. సోమవారం అసెంబ్లీలో తనతో పాటు టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌ తర్వాత.. ఆయన తమ టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతో కలిసి తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తుంటే.. ఆయనకు అసెంబ్లీలో మరో పది మంది ఉన్మాదులు తోడై మరింత ఉన్మాదంతో ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ‘ఈయన ఏడాదిన్నర ముఖ్యమంత్రి. వాళ్లలో అనేక మంది మొదటిసారి ఎమ్మెల్యేలు. స్థాయి కూడా మరిచి నన్ను హేళన చేయాలని చూస్తున్నారు.


  వీళ్లకు  తెలిసిందల్లా గాలి మాటలు.. సొల్లు కబుర్లు. లక్షల ఎకరాల్లో పంటలు పోయి రైతులు దిగాలుపడి ఉంటే ఇంత సీరియస్‌ అంశంలో సొల్లు చెబుతారా? హుద్‌హుద్‌, తితలీ తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడకు వెళ్లి కూర్చుని పని చేసిన నేను పనికిమాలిన వాడిని.. ఇంట్లో కూర్చున్న మీరు గొప్పవాళ్లా? నా రాజకీయ అనుభవాన్ని ప్రశ్నిస్తారా? నా అనుభవమంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు. నలుగురు ఉన్మాదులను పోగు చేసుకుని నా పైకి వస్తారా? అందుకే బండగా ఏం పీకుతారని ప్రశ్నించాల్సి వచ్చింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కూడా ఎప్పుడైనా తొందరపడి మాట మీరినా వెంటనే దిద్దుకుని ఉపసంహరించుకునేవాడు. వీళ్లకు ఆ సంస్కారం లేదు.


మాట మాట్లాడితే 151 సీట్లని అంటారు. మాకు 40 శాతం ఓట్లు వస్తే వాళ్లకు 50 శాతం వచ్చాయి. అందులో ఐదు శాతం మారితే వీళ్లు ఇంట్లో కూర్చుంటారు. వాళ్లకు 151 సీట్లు వస్తే ఎవరూ మాట్లాడకూడదా? మాట్లాడితే మండలి రద్దు.. మా సస్పెన్షన్‌.. రేపు కోర్టులు కూడా రద్దు అంటారేమో? వీళ్లలో ఏదో పెద్ద లోపం ఉంది. విచిత్ర మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారు. అదేమిటో కాలమే చెప్పాలి. వీరి ఉన్మాద చర్యల వల్ల నంద్యాలలో సలాం కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. అడిగితే మాపై ఎదురు దాడి. శుక్రవారం వస్తే విశాఖలో ప్రజలు గడగడలాడుతున్నారు. సెలవు రోజుల్లో ఎవరి ఆస్తిని కూలగొడతారా... ఎవరిని అరెస్టు చేస్తారోనని భయపడే వాతావరణం నెలకొంది. పిచ్చి నిర్ణయాలు తీసుకుని మళ్లీ వాటికి రంగుల ప్రకటనలు. టిడ్కో ఇళ్లు మీరు  కట్టారా... డిజైన్‌ చేశారా? మేం కట్టాం. మేం మళ్లీ వస్తే 300 అడుగుల వరకూ ఉచితమని.. ఆ పై విస్తీర్ణంలో ఉన్నవాటికి అదనపు విస్తీర్ణానికి మాత్రమే తీసుకుంటామని చెప్పాం. ఈయన మాత్రం ఎంత విస్తీర్ణం ఉన్నా మొత్తం ఫ్రీ అన్నాడు.


ఇప్పుడు 300 అడుగుల వరకే ఉచితమని అంటాడు. మిగిలిన వాటి గురించి మాట్లాడడు. వీళ్ల పొట్ట కోసినా నిజాలు రావు’ అని ధ్వజమెత్తారు. ఈ వికారపు చేష్టలకు పోలీసులూ తోడు కావడం ఆశ్చర్యం కలిగిస్తోందని, ఏదో ఒక దశలో వారు కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. అమరావతిని ముంచాలని కలలు కని.. చివరకు తమ అసమర్థతతో కడపను ముంచుకున్నారని ఎద్దేవా చేశారు. సెక్షన్‌ 77 కింద ఆయనపై చర్యలకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై ప్రశ్నించినప్పుడు.. ‘చేతనైంది చేసుకోమనండి.. కావాలంటే అసెంబ్లీ నుంచి తొలగించుకోమనండి’ అని ఆయన బదులిచ్చారు.రైతులకు 3-4 వేల కోట్లు అందేవి..


రైతుల తరపున బీమా సొమ్మును కట్టకుండా వైసీపీ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరించడంతో ఈ ప్రకృతి విపత్తులో వారికి పైసా సాయం అందని పరిస్థితి నెలకొందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. సకాలంలో బీమా సొమ్ము కట్టి ఉంటే వారికి రూ.3-4 వేల కోట్లు బీమా కంపెనీల నుంచి సాయం అంది ఉండేదని చెప్పారు. ఇప్పుడు ఆ సాయం వారికి ఎవరు ఇస్తారని  ప్రశ్నించారు. ‘మేం సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వమే సమాధానమిస్తూ.. పోయిన ఏడాది ఖరీ్‌ఫలో పంటల బీమా కింద కేవలం రూ.33 కోట్లు చెల్లించామని చెప్పింది. రూ.1,300 కోట్లు చెల్లించాల్సిన చోట కేవలం రూ. 33 కోట్లు చెల్లిస్తే ఇక రైతులకు అందే సాయం ఏమిటి? ఈ ఏడాది పైసా కూడా చెల్లించలేదు. ఈ ప్రభుత్వ చేతగానితనానికి రైతులు నష్టపోయారు’ అని తెలిపారు. ఏదో కొత్త విధానం తెస్తామని మాయ మాటలు చెప్పి ఉన్నది కూడా పోగొట్టారని ధ్వజమెత్తారు. నష్టం జరిగాక ఇప్పుడు బీమా సొమ్ము చెల్లిస్తామని చెబుతున్నారని.. మనిషి చనిపోయిన తర్వాత బీమా కంపెనీలు ప్రీమియం కట్టించుకుని పరిహారం ఇస్తాయా.. ఎవరి చెవిలో పూలు పెడుతున్నారని నిలదీశారు. 

Updated Date - 2020-12-01T08:52:39+05:30 IST