మహిళల కష్టం పట్టదా?
ABN , First Publish Date - 2020-03-08T09:59:34+05:30 IST
‘కులం చూడం.. మతం చూడం.. ప్రతి అక్కకు, చెల్లికి అండగా ఉంటాం.. అన్న వస్తున్నాడని చెప్పమన్నారే.. 81 రోజులుగా రోడ్డు మీదకొచ్చి గోడు వెలబోసుకుంటుంటే పట్టించుకోవా జగనన్నా..’
జగనన్నా.. మా బాధలు కనపడటం లేదా?
ఏ అక్కాచెల్లికీ కష్టం రానివ్వనన్నావే!
చెవిలో పువ్వులతో మైనార్టీ మహిళల నిరసన
81వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు
అనంతవరం వెంకన్నకు మహిళల పూజలు
స్థానిక ఎన్నికల్లో ఓటుతో నిరసన తెలుపుతాం
గుంటూరు, విజయవాడ, తుళ్లూరు, మంగళగిరి, తాడికొండ, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ‘కులం చూడం.. మతం చూడం.. ప్రతి అక్కకు, చెల్లికి అండగా ఉంటాం.. అన్న వస్తున్నాడని చెప్పమన్నారే.. 81 రోజులుగా రోడ్డు మీదకొచ్చి గోడు వెలబోసుకుంటుంటే పట్టించుకోవా జగనన్నా..’ అని అమరావతి మహిళలు వాపోయారు. ‘రాజధాని తరలింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాకా తమ పోరాటం ఆగదని.. సీఎం సహా మంత్రులందరూ అమరావతి గ్రామాల్లో పర్యటించి రైతుల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆ ప్రాంత రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగిచాలంటూ చేపట్టిన ఆందోళనలను వారు శనివారం 81వ రోజు కొనసాగించారు. తుళ్లూరు, మందడంలో మహాధర్నా, వెలగపూడి, రాయపూడి, కృష్ణాయపాలెం, యర్రబాలెం, గుంటూరు కలెక్టరేట్ ఎదురు, తాడికొండ అడ్డరోడ్డు, పెదపరిమి, తాడేపల్లి తదితర ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు కొనసాగించారు.
నమ్మి ఓట్లేస్తే చెవులో పువ్వులు పెడతారా?
నమ్మి ఓట్లేస్తే జగన్ తమచెవిలో పూలుపెట్టి ముంచారని రాయపూడి రైతులు, మైనార్టీ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు మూడు రాజధానులు అని ఎందుకు చెప్పలేదని వైసీపీని ప్రశ్నిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిరసన తెలుపుతామన్నారు.
వర్షంలోనూ ఆందోళన..
శనివారం ఉదయం కురిసిన వర్షానికి తుళ్లూరు దీక్షా శిబిరం నీటితో నిండిపోయింది. అయినా రోడ్డుపై కుర్చీలు వేసుకొని రైతులు, మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎండా, వాన తేడా లేకుండా రోడ్డెక్కే పరిస్థితికి ఈ ప్రభుత్వం తెచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై నిలిచిన నీటిని తోడి పారబోశారు. తాతముత్తాతల నుంచి సంక్రమించిన భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం దానమిచ్చిన తమకు ఈ ఖర్మ పట్టిందన్నారు. మధ్యాహ్నానికి నీటిని తోడివేసి ఆరబెట్టి, తిరిగి శిబిరాలలోకి వెళ్లి దీక్షను కొనసాగించారు. తాడేపల్లి మండలం పెనుమాక శిబిరంలో ఓ పక్క మహిళలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉండవల్లి దీక్షా శిబిరం వద్ద చేతులు కట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు గ్రామాలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. కృష్ణాయపాలెంలో రైతులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతవరంలో కొలువై ఉన్న వెంకన్న ఆలయంలో రాజధాని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.శాఖమూరు తానపతి చెరువు వద్ద ఉన్న సమ్మక్క,సారలమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ ఆలయానికి పాదయాత్రగా వెళ్లాలని జేఏసీ నేతలు తలపెట్టారు.
ఉద్యమానికి రిటైర్డ్ ఏఎస్పీ మద్దతు..
రాజ్యాంగ ప్రసాదించిన హక్కుల మేరకు ఎవరికైనా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని రిటైర్డ్ ఏఎస్పీ కాళహస్తి సత్యనారాయణ చెప్పారు. దానిని ఎవరు హరించాలని చూసినా చట్టరీత్యా నేరమే అన్నారు. అమరావతి రైతుల ఆందోళనకు ఆయన తన మిత్రబృదంతో కలిసి మద్దతు తెలిపారు. రూ.70వేలు ఆర్థిక సాయం అందించారు. అనంతపురం, కదిరి రైతులు, మహిళలు బస్సులో వచ్చి ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి రైతులు కూడా వచ్చి మద్దతు తెలిపారు. తమ భూములను పేదల ఇళ్ల స్థలాల పేరిట తహశీల్దార్ వనజాక్షి నేతృత్వంలో అధికారులు లాకుంటున్నారని, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలానే రాష్ట్ర టీడీపీ బీసీసెల్ కన్వీనర్ తాడిబోయిన చంద్రశేఖర్ అనంతపురం నుంచి వచ్చి రాజఽధాని ఉద్యమానికి బాసటగా నిలిచారు.
విజయవాడలో భారీ ర్యాలీ
అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. గుణదల క్రీస్తురాజపురం రోడ్డు నుంచి ప్రారంభమై లయోలా కళాశాల వెనుక భాగాన ఉన్న అమ్మ కల్యాణ మండపం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. వేలసంఖ్యలో ఉద్యమకారులు ఈ ర్యాలీలో పాల్గొని ‘జై అమరావతి’ అంటూ నినదించారు. జేఏసీ కన్వీనర్ ఎ.శివారెడ్డి మాట్లాడుతూ రాజధాని అమరావతి కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ అమరావతిలో రాజధాని కోసం అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వం లేని సమస్యలను తీసుకువస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ రాజధానిపై అనాలోచిత నిర్ణయాలను ప్రభుత్వం ఇప్పటికైనా మార్చుకోవాలన్నారు. జేఏసీ నాయకుడు ఆర్‌వీ స్వామి, వైవీ రమణారావు, వాసిరెడ్డి వంశీకృష్ణ, అక్కినేని వనజ, సుంకర పద్మశ్రీ, పరుచూరి కిరణ్, మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.