ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు
ABN , First Publish Date - 2020-08-11T12:12:58+05:30 IST
ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు

విశాఖపట్నం, అమరావతి(ఆంధ్రజ్యోతి): ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. మరోవైపు తమిళనాడు కోస్తా తీరానికి దగ్గర నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. కాగా, వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈనెల 13వ తేదీన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం ఉత్తరాంధ్ర, యానాం, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. దక్షిణకోస్తాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ఈనెల 11, 12 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు, 13,14 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.