మరో 4 రోజులు వర్షాలు
ABN , First Publish Date - 2020-08-01T10:00:07+05:30 IST
మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరో వైపు దక్షిణ కోస్తాంధ్రను ఆనుకుని ఉన్న ఉత్తర

విశాఖపట్నం, అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): మరట్వాడ నుంచి ఉత్తర కర్ణాటక వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరో వైపు దక్షిణ కోస్తాంధ్రను ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శుక్రవారం ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు, కర్నూలు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరుగా, మరికొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. ఆగస్టు 1,2,3,4 తేదీల్లో దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, 3,4 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 4న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ అధికారులు తెలిపారు.
ఆగస్టు, సెప్టెంబరుల్లో సాధారణ వర్షపాతమే!
నైరుతి రుతుపవనాల సీజన్‌లో తొలి రెండు నెలల కాలం ముగిసింది. మిగిలిన రెండు నెలల్లో కురవనున్న వర్షాలపై భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం బులెటిన్ విడుదల చేసింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో సాధారణ వర్షపాతం నమోదు కానున్నట్టు తెలిపింది. రెండో సీజన్‌లో దీర్ఘకాల సగటు 104 శాతం వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఆగస్టు, సెప్టెంబరుల్లో 42.83 సె.మీ. వర్షపాతం నమోదవుతుందని, సీజన్ వర్షపాతంలో ఇది 49 శాతమని వివరించింది. పసిఫిక్ మహాసముద్రంలో శీతల తటస్థ పరిస్థితులు కొనసాగుతున్నాయని, దీనివల్ల వర్షపాతం తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.