దానిని రాజధాని అంటారా?

ABN , First Publish Date - 2020-12-26T07:40:10+05:30 IST

అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలిసి ఉంటేనే అది రాజధాని అవుతుందని, అటువంటి రాజధానిని నిర్మిస్తామని సీఎం జగన్‌ అన్నారు.

దానిని రాజధాని అంటారా?

  • పేదలు సహా ఏ కులమూ ఉండకూడదంటే ఎలా?
  • అన్ని కులాలు, మతాలు కలిసి ఉంటేనే రాజధాని 
  • అమరావతిలో ఇళ్ల స్థలాలపై స్టే ఆశ్చర్యమే: జగన్


కాకినాడ, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు కలిసి ఉంటేనే అది రాజధాని అవుతుందని, అటువంటి రాజధానిని నిర్మిస్తామని సీఎం జగన్‌ అన్నారు. పేదలు సహా ఏ కులం ఉండకూడదంటే.. దానిని రాజధాని అంటారా అని ప్రశ్నించారు. తూర్పు గోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పంపిణీకి హాజరైన ఆయన ప్రసంగిస్తూ.. కేసులు, స్టేలు ఉండడంతో 3.74 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామని తెలిపారు. అమరావతిలో 54 వేల మంది పేదలకు పట్టాలివ్వాలని కార్యాచరణ చేపట్టి ముందడుగు వేస్తే.. కులపరమైన అసమతుల్యత (డెమోగ్రాఫిక్‌ ఇంబ్యాలెన్స్‌) అంటూ గత ప్రభుత్వానికి చెందిన వాళ్లు కోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం స్టే విధించిందని పేర్కొన్నారు. ఆ పిటిషన్‌ను చూసి కోర్టు స్టే ఇవ్వడం తనకు ఆశ్చర్యంగా అనిపించిందన్నారు. ‘అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు అంతా కలిసి ఉంటేనే రాజధాని అంటారు. అందరికీ చోటు ఇస్తేనే అది సమాజం.. అందరికీ మంచి చేస్తేనే ప్రభుత్వం అనిపించుకుంటుంది. అటువంటి సమాజం, ప్రభుత్వాన్ని, రాజధానిని దేవుడి దయతో నిర్మిస్తాం’ అని పేర్కొన్నారు.


శుక్రవారం ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిసి చివరకు గురువారం కూడా హైకోర్టులో పిల్‌ వేశారని.. పులివెందులలో కూడా ఇలాగే పిల్‌ వేశారని ఆరోపించారు. వాళ్లు మానవత్వం లేనివాళ్లని ఆరోపించారు. ‘చంద్రబాబు, ఆయన సహచరులు అడుగడుగునా అడ్డంకులతో కేసులు వేయడం వల్ల పది శాతం మంది లబ్ధిదారులకు స్థలాలు ఇవ్వలేకపోయాం. వీరి దుర్బుద్ధి చూస్తుంటే వీళ్లు ప్రజాజీవితంలో ఉండడానికి అర్హులేనా అనిపిస్తుంది. వీరికి దేవుడు కచ్చితంగా మొట్టికాయలు వేస్తాడు’ అని జగన్‌ హెచ్చరించారు.


రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే కులాలు మారిపోతాయని కేసు వేస్తే.. స్టేలు రావడం బాధగా అనిపించింది. 

ఏ కులమూ ఉండకూడదు, పేదలు ఉండకూడదు.. ఉంటే కులాలు మారిపోతాయనే స్థాయికి వెళ్తే దానిని రాజధాని అంటారా? 

- సీఎం జగన్మోహన్‌రెడ్డి

Updated Date - 2020-12-26T07:40:10+05:30 IST