ఇది సెక్యులర్‌ రాష్ట్రమేనా

ABN , First Publish Date - 2020-09-25T08:35:45+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పలురకాల కారణాలు చూపిస్తూ... కేసులు ఉపసంహరించుకోవడం అప్పుడప్పుడూ జరిగేదే! కానీ...

ఇది సెక్యులర్‌  రాష్ట్రమేనా

‘ముస్లిం యూత్‌’ అంటూ వారందరికీ వర్తింపజేస్తారా?

జీవోలో మతం ప్రస్తావన ఎందుకు?

ఇది ఓట్ల కోసమే చేసినట్లు ఉంది!

ప్రభుత్వం నడిపే తీరు ఇదేనా?

ఠాణాపై దాడి కేసులో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణ కుదరదు

హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

ఆ జీవో సస్పెన్షన్‌.. ఎఫ్‌ఐఆర్‌లపై స్టేట్‌సకో


అమరావతి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం పలురకాల కారణాలు చూపిస్తూ... కేసులు ఉపసంహరించుకోవడం అప్పుడప్పుడూ జరిగేదే! కానీ... పాత గుంటూరు పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన కేసును రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ‘ముస్లిం యువతకు వ్యతిరేకంగా ఉన్న ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరించుకుంటున్నాం’ అని పేర్కొనడంపై హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. ‘ముస్లిం యూత్‌’ అంటూ... ఆ ఘటనను మొత్తం ఆ సామాజికవర్గానికి ఎలా వర్తింపజేస్తారని నిలదీసింది. సదరు జీవోలో సామాజికవర్గాన్ని ప్రస్తావించడం రాజ్యాంగ పీఠికకే విరుద్ధమని వ్యాఖ్యానించింది. అసలు ఇది సెక్యులర్‌ రాష్ట్రమేనా అని నిలదీసింది.


‘ముస్లిం యూత్‌కు వ్యతిరేకంగా ఉన్న ప్రాసిక్యూషన్‌ను ఉపసంహరిస్తున్నాం’ అంటూ జారీ చేసిన ఆ  జీవోను పరిశీలిస్తే అది ప్రాసిక్యూషన్‌ ఉపసంహరణ కోసం జారీ చేసినట్లుగా లేదని, రాజకీయ లబ్ధి కోసమే అన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. ‘‘ఓట్లు దక్కించుకునేందుకే ఇలా వ్యవహరించినట్లుంది. దీనిని అనుమతించలేం. అసలు ప్రభుత్వం నడిపే తీరు ఇదేనా?’ అని నిలదీసింది.


హోంశాఖ జారీ చేసిన ఆ జీవోను సస్పెండ్‌ చేస్తూ... ఆ ఘటనకు సంబంధించి నమోదైన ఆరు ఎఫ్‌ఐఆర్‌లపై స్టేటస్‌ కో (యథాతథ స్థితి) విధించింది.  హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 


రెండేళ్లయినా కేసుల్లో పురోగతి లేదు...

ఒక మైనర్‌ బాలికపై వేధింపులకు పాల్పడిన వ్యక్తిని తమకు అప్పగించాలంటూ 2018 మే 15వ తేదీన పాత గుంటూరు పోలీస్‌ స్టేషన్‌పై కొందరు దాడికి దిగారు. ఈ ఘటనలో పోలీసులు కూడా గాయపడ్డారు. దీనిపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే... ఇందులో ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకుంటూ  ఆగస్టు 12వ తేదీన జీవో నంబరు 776 జారీ అయ్యింది. దీనిని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన పసుపులేటి గణేశ్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. పోలీస్‌ స్టేషన్‌పై జరిగిన దాడి కేసులపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని అభ్యర్థించారు. ఈ పిల్‌పై గురువారం ధర్మాసనం ముందు విచారణ జరిగింది.


ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎ్‌సపీ సురేశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ..  ‘‘ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిని తమకు అప్పగించాలని డిమాండ్‌ చేస్తూ.. కొంతమంది ముస్లిం నేతల ఆధ్వర్యంలో యువకులు కర్రలు, రాళ్లతో స్టేషన్‌పై దాడి చేశారు.  క్షతగాత్రులైన పోలీసులే స్వయంగా ఫిర్యాదు చేశారు.  ఇప్పటి వరకూ ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు.  ఇప్పుడు... నిందితులపై ప్రాసిక్యూషన్‌ ఉపసంహరించుకుంటున్నట్లు  డీజీపీ రాసిన లేఖ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది’’ అని తెలిపారు.


  ఈ సందర్భంగా ధర్మాసనం జీవోను పరిశీలించింది. అందులో ‘ముస్లిం యూత్‌’ అన్న పదాలను ఎలా ప్రస్తావించారని దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆ జీవో దురుద్దేశాన్ని సూచిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 


ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్నందునే: జీపీ

హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది మహేశ్వర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఎఫ్‌ఐఆర్‌లలో సామాజిక అంశం ప్రస్తావించడంతో జీవోలో కూడా దానిని చేర్చాల్సి వచ్చిందని తెలిపారు.  ఓ మైనర్‌ బాలికపై లైంగికదాడి చేసిన నిందితుడు స్టేషన్‌లో ఉన్నాడని తెలిసి ఒకే సామాజికవర్గానికి చెందిన యువత అక్కడకు తరలివచ్చిందని, ఈ సందర్భంగా ఆ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ఇరు పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ‘ఈ వ్యవహారంలో దర్యాప్తును స్వతంత్ర సంస్థకు బదిలీ చేయడానికి డీజీపీ ఉద్దేశం ఒక్కటి చాలు’ అని పేర్కొంది.


ఇలా వ్యవహరించవద్దని డీజీపీ, హోంశాఖలకు సూచించాలని ప్రభుత్వ న్యాయవాదికి సలహా ఇచ్చింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు సమర్పిస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, గుంటూరు ఎస్పీ, పాత గుంటూరు ఎస్‌హెచ్‌వోలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో ఇప్పటికే సీబీఐ ప్రతివాదిగా ఉన్నప్పటికీ... జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)ను కూడా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. తదుపరి విచారణను అక్టోబరు 1వ తేదీకి వాయిదా వేసింది.
అప్పుడేం జరిగిందంటే...


2017 మే నెల 15న సాయంత్రం గుంటూరు నగరంలోని నందివెలుగురోడ్డులోని రాజీవ్‌గృహ కల్ప వద్ద ఓ బాలికను పక్కింటికి చెందిన యువకుడు ముద్దుపెట్టుకుని, అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై ఆ బాలిక తల్లి అదే రోజు రాత్రి పాత గుంటూరు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే యువకుడు బాలికపై అత్యాచారం చేశాడని కొందరు, అత్యాచారం చేసి చంపాడని మరి కొందరు ప్రచారం చేశారు.


దీంతో తమ వర్గం వారికి అన్యాయం జరిగిందని, పోలీసులు పట్టించుకోవడం లేదని కొందరు యువకులు స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.  పలువురికి ఫోన్‌లలో మెసేజ్‌లు పంపారు. దీంతో నిమిషాల్లోనే పెద్ద సంఖ్యలో యువకులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులు స్టేషన్‌పై రాళ్లు రువ్వడం, వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడం... సుమారు 4 గంటలపాటు అక్కడ వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఈ దాడిలో అదనపు ఎస్పీ కారు, ఫైరింజన్‌ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులు, విలేకరులకు గాయాలయ్యాయి.


ఈ దాడి కుట్రలో భాగంగా జరిగిందని,  ఆ సామాజిక వర్గానికి సంబంధం లేని వైసీపీ యువజన నాయకుడు ఒకరు సంఘటనా ప్రదేశానికి వచ్చి దాడికి ఉసిగొల్పారనే  ఆరోపణలు వచ్చాయి.  నిమిషాల వ్యవధిలో వందలాది మంది పోగవడం, అందులో ఇతర సామాజిక వర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు ఉండటం నిఘా వర్గాలు గుర్తించాయి. పోలీసులు మొత్తం 187 మందిని గుర్తించారు. 11 మందిని అప్పట్లోనే అరెస్ట్‌ చేశారు. ఆ కేసులో ఎక్కువ మంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు రాగా... ఆ కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

- గుంటూరు


Updated Date - 2020-09-25T08:35:45+05:30 IST