వినాయక విగ్రహానికి అపచారం

ABN , First Publish Date - 2020-09-13T07:39:26+05:30 IST

వినాయక విగ్రహానికి అపచారం

వినాయక విగ్రహానికి అపచారం

  • మలం పూసిన ఆగంతుకులు..
  • ‘తూర్పు’లో మరో దారుణం 

రాజమహేంద్రవరం రూరల్‌/రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 12: అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటన మర్చిపోకముందే తూర్పుగోదావరి జిల్లాలో మరో అపచారం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం రూరల్‌ మండలం పరిధిలోని ఓ ఆలయంలో వినాయక విగ్రహానికి గుర్తుతెలియని వ్యక్తులు మలం పూయడం ఉద్రిక్తతకు దారితీసింది. పిడింగొయ్యి పంచాయతీ పరిధిలోని వెంకటగిరి ప్రాంతం మున్సిబ్‌ వీధి సమీపంలోని వినాయక ఆలయాన్ని పదేళ్ల క్రితం స్థానికులు, భక్తులు కలసి నిర్మించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఆలయంలోని విగ్రహానికి కొందరు మలం పూసి దుశ్చర్యలకు పాల్పడ్డారు. శనివారం ఉదయం పూజలు నిర్వహించడానికి వెళ్లిన భక్తులు వినాయక విగ్రహానికి మలం పూసి ఉండటం గుర్తించి నివ్వెరపోయారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఇటువంటి అకృత్యాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దోషులను పట్టుకొని శిక్షించాలని పోలీసులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు భక్తులను సముదాయించి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఆలయంలోని సీసీ ఫుటేజీ ఆధారంగా ఆరుగురు అనుమానితులను గుర్తించామని అర్బన్‌ జిల్లా తూర్పుమండల డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌ తెలిపారు. వారిని 24గంటల్లో అరెస్టు చేస్తామన్నారు. 


Updated Date - 2020-09-13T07:39:26+05:30 IST