-
-
Home » Andhra Pradesh » INSPITE OF HAVING HUGE MAJORITY
-
ఎందుకింత భయం?
ABN , First Publish Date - 2020-03-13T09:37:07+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ గూండాలు, రౌడీల అరాచకాలు, అకృత్యాలకు లెక్కలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం దౌర్జన్యాలు చేస్తున్నారని...

- 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు
- ఏకగ్రీవం కోసం అరాచకాలు, అకృత్యాలు
- ఇంతదానికి స్థానిక ఎన్నికలెందుకు?
- జగన్‌రెడ్డే ప్రకటించుకోవచ్చుగా!
- వైసీపీకి ముకుతాడు వేయాలి
- ప్రజలకు పవన్ కల్యాణ్ పిలుపు
- రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ: కన్నా
- స్థానిక ఎన్నికలకు ‘విజన్ డాక్యుమెంట్’
అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ గూండాలు, రౌడీల అరాచకాలు, అకృత్యాలకు లెక్కలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం దౌర్జన్యాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ జిల్లాలో చూసినా నామినేషన్లు వేయడానికి భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ ఎందుకు ఇంత భయపడుతోందో అర్థం కావడం లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం జనసేన, బీజేపీ సిద్ధం చేసిన ‘విజన్ డాక్యుమెంట్’’ను గురువారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ‘అనంతపురంలో జనసేన పీఏసీ సభ్యుడు చిలకం మధుసూధన్‌రెడ్డిపై రాళ్ల దాడి చేయడం, శ్రీకాళహస్తిలో బీజేపీ నాయకులపై దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ ఎందుకు ఇంత భయపడుతోందో అర్థం కావడం లేదు. ఈ మాత్రం దానికి ఎన్నికలెందుకు? ఏకగ్రీవం చేయడానికి ఎన్నికలెందుకు.. ఎన్నికల సంఘం ఎందుకు.. జగన్‌రెడ్డే ప్రకటించుకోవచ్చు కదా’ అని విమర్శించారు. గోదావరి జిల్లాల్లో రైతుల్ని బెదిరిస్తున్నారని, ఏకగ్రీవం చేయకపోతే భూములు లాగేసుకుంటాం.. బైండోవర్ కేసులు పెడతామని బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. కళ్ల ముందు ఇదంతా జరుగుతుంటే చర్య తీసుకోకపోవడం నేరపూరిత రాజకీయాలకు వంత పాడినట్లు అవుతుందని.. దీనిపై ఎన్నికల సంఘం దృష్టిపెట్టాలని కోరారు. పోలీసులు మహిళలను దుర్భాషలాడడం దారుణమని, కొంత మంది పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ‘భయపెట్టి సాధించిన గెలుపు ఎన్నటికీ నిలబడదు. జనసేన, బీజేపీ తరపున నామినేషన్లు వేసిన వాళ్లు ధైర్యంగా నిలబడండి. బెదిరింపులకు లొంగవద్దు. అదుపుతప్పిన ఎద్దు ముక్కుకు తాడేసినట్లుగా.. వైసీపీ రౌడీయిజానికి ముకుతాడు వేయాల్సిన సమయం వచ్చింది. అది త్వరలోనే జరుగుతుంది. ప్రజలందరూ దీని కోసం కలిసి రావాలి’ అని పిలుపిచ్చారు.
ప్రజాస్వామ్యం ఖూనీ: కన్నా
స్థానిక ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కన్నా ఆరోపించారు. సొసైటీలు నామినేట్ చేసుకున్నట్లు ఆర్డినెన్సు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో అభ్యర్థులను నామినేట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ఎద్దేవా చేశారు. ‘మీ ప్రాంతాల్లో గెలిపించుకుని రాకపోతే మీ ఉద్యోగాలు పీకేస్తామని స్వయంగా సీఎం జగన్ మంత్రులకు, ఎమ్మెల్యేలకు చెప్పడం దారుణం. రాష్ట్రంలో నియంతృత్వానికి ఫ్యాక్షనిజం తోడైంది. గతంలో టెండర్లు వేయకుండా, టెండర్ ఫాంలు లాక్కున్నట్లు, ఇప్పుడు ఎన్నికల నామినేషన్ పత్రాలను లాక్కుంటున్నారు. నా రాజకీయ జీవితంలో ఇటువంటి సంఘటనలు చూడలేదు’ అని అన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ దేవధర్ అన్నారు.