పురుగు మందులే కారణం

ABN , First Publish Date - 2020-12-17T08:35:19+05:30 IST

మనుషుల శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు ఎలా ప్రవేశించాయన్న దానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని సీఎం జగన్‌ అన్నారు.

పురుగు మందులే కారణం

ఏలూరులో అంతుచిక్కని వ్యాధిపై వైద్యనిపుణుల అంచనా 

 దీర్ఘకాలిక అధ్యయన బాధ్యతలు  ఎయిమ్స్‌, ఐఐసీటీకి  

వైద్యసంస్థల ప్రతినిధులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌


అమరావతి, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): మనుషుల శరీరాల్లోకి పురుగు మందుల అవశేషాలు ఎలా ప్రవేశించాయన్న దానిపై దీర్ఘకాలంలో మరింత అధ్యయనం అవసరమని సీఎం జగన్‌ అన్నారు. ఏలూరులో అంతుచిక్కని వ్యాధికి గల కారణాలపై కేంద్ర వైద్య, సాంకేతిక, పరిశోధన సంస్థల నిపుణులతో ఆయన బధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పురుగు మందుల అవశేషాలే ఈ వ్యాధికి కారణమని ఎయిమ్స్‌, ఐఐసీటీ సహా ప్ర ముఖ సంస్థల నిపుణులు అభిప్రాయపడ్డారు. సీఎం మాట్లాడుతూ ఏలూరులో ఎప్పటికప్పుడు వైద్య  పరీక్షలు చేయాలని అధికారులను ఆదేశించా రు. పురుగు మందుల అవశేషాలపై అధ్యయనం చేసే బాధ్యతను ఢిల్లీ ఎయిమ్స్‌, ఐఐసీటీకి అప్పగించారు. ప్రతి జిల్లాలో ప్రజారోగ్య ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని, ఎప్పటికప్పుడు ఆహారం, తాగునీరు, మట్టి నమూనాల పరీక్షలు చేయాలని ఆదేశించారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని సీఎ్‌సను ఆదేశించారు. ఏలూరు తరహా ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలన్నారు.


జిల్లాల్లో తాగునీటి వనరుల పరిశీలన చేయాలన్నారు.  సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆరోగ్యానికి హాని కలిగించే పురుగు మందులను మార్కెట్‌ నుంచి పూర్తిగా తొలగించాలని, దీనిపై వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోచోట జరిగితే ఏం చేయాలన్న దానిపై వైద్యపరంగా కార్యాచరణ రూపొందించాలని ఎయిమ్స్‌ మంగళగిరి వైద్యులను సీఎం ఆదేశించారు.

Updated Date - 2020-12-17T08:35:19+05:30 IST