ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతు ఖాతాలోకి!

ABN , First Publish Date - 2020-12-19T07:56:31+05:30 IST

రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాలను నేరుగా ఆర్‌టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఇన్‌పుట్‌ సబ్సిడీ రైతు ఖాతాలోకి!

29న తలో 2 వేల భరోసా.. 718 కోట్ల నివర్‌ సబ్సిడీ

సర్వే చట్టంలో సవరణలు.. పర్యాటకానికి రిసార్ట్‌ ప్యాకేజీ

రూ.400 కోట్లు పెట్టుబడులు పెడితే మెగా ప్రాజెక్టే 

లీజు 33 నుంచి 99 ఏళ్లకు పెంపు.. కేబినెట్‌ నిర్ణయాలు


అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాలను నేరుగా ఆర్‌టీజీఎస్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారమిక్కడ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా ఇళ్ల నిర్మాణంపై చర్చించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరు జిల్లాల్లో వాటర్‌ షెడ్‌ అభివృద్ధి పథకం అమలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మూడో విడత రైతు భరోసా అమలుకు అంగీకరించింది. ఒక్కో రైతు, కౌలు రైతులకు రూ.రెండేసి వేలను ఈ నెల 29న నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలని తీర్మానించింది. దీనివల్ల 50.47 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఇదివరకు రెండు విడతల్లో రూ.11,500 చెల్లించారు. మూడో విడతతో కలుపుకొని వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.13,500 పూర్తిగా చెల్లించినట్లవుతుంది. నివర్‌ తుఫాను వల్ల నష్టపోయిన 8,06,504 మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీగా రూ.718 కోట్లను ఈ నెల 29న అందజేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే కరోనా వ్యాప్తితో సంక్షోభంలో పడిన పర్యాటక రంగాన్ని ఆదుకునేందుకు తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా రిసార్ట్‌ ప్యాకేజీకి ఆమోద ముద్ర వేసింది. దీనిప్రకారం.. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లకు, సర్వీసు ప్రొవైడర్‌లకు, రెస్టారెంట్లకు.. మొత్తంగా 3.910 యూనిట్లకు రిసార్ట్‌ ప్యాకేజీని ఖరారుచేసింది. దీనికింద రూ.50,000 నుంచి 15,00,000 దాకా వాటికి బ్యాంకులు రుణాలు అందించేలా రూ.1,985 కోట్లతో విధానాన్ని రూపొందించారు. అలాగే పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా పాలసీని ప్రభుత్వం రూపొందించింది. కొత్తగా వచ్చే టూరిజం యూనిట్లకు ఎస్‌జీఎ్‌సటీలో 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. ఐదేళ్ల పాటు విద్యుత్‌ యూనిట్‌ రూ.2కే ఇస్తుంది.


స్టాంపు డ్యూటీని 100 శాతం రీయింబర్స్‌ చేస్తారు. ల్యాండ్‌ కన్వర్షన్‌ చార్జీలకు పూర్తి రాయితీ ఉంటుంది. రూ.400 కోట్లు పెట్టుబడులు పెడితే దానిని మెగా టూరిజం ప్రాజెక్టుగా పరిగణిస్తారు. లీజు కాలాన్ని 33 నుంచి 99 ఏళ్లకు పెంచుతారు. కర్నూలు జిల్లా అవుకు మండలం సుంకేశుల వద్ద 11.83 ఎకరాల భూమిని అటవీ శాఖకు అప్పగించి.. ఆ విస్తీర్ణం మేరకు హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువల నిర్మాణానికి అటవీ భూమిని వినియోగించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. అదేవిధంగా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నాబార్డు నుంచి రూ.1,931 కోట్ల రుణం తీసుకునేందుకు జల వనరుల శాఖకు అనుమతి ఇచ్చింది. పులివెందుల బ్రాంచి కెనాల్‌, కడప బ్రాంచ్‌ కెనాల ఫేజ్‌-2 కింద సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు సమాచార మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు.


మరిన్ని నిర్ణయాలివీ..

పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖలో నియోజకవర్గ స్థాయి పశువ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో కాంట్రాక్టు విధానంలో 147 మంది చొప్పున ల్యాబ్‌ టెక్నీషియన్లు, ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీ.


పులివెందులలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌ ఏర్పాటు. ఈ నెల 24న శంకుస్థాపన. ఈ  భవన సముదాయానికి వ్యయం రూ.83.59 కోట్లు.

రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, నర్సింగ్‌ కాలేజీలను బలోపేతానికి ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు. 


21 నుంచి రాష్ట్రంలో సమగ్ర సర్వే ప్రారంభించేందుకు పచ్చజెండా. ఇందుకోసం 1923 నాటి ఏపీ సర్వే, సరిహద్దుల చట్టంలో సవరణలకు ఆమోదం.


చిత్తూరు జిల్లాలో సర్వే ట్రైనింగ్‌ కాలేజీ ఏర్పాటు.


ప్రకాశం జిల్లాలో పప్పుధాన్యాలు, తృణధాన్యాల పరిశోధన కోసం ప్రకాశం జిల్లా లింగసముద్రంలో 410.30 ఎకరాలను ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగింత.


అదనపు అడ్వకేట్‌ జనరల్‌గా జాస్తి నాగభూషణ్‌ నియామకానికి ఆమోదముద్ర.


చిత్ర పరిశ్రమకు చేయూతథియేటర్ల ఫిక్స్‌డ్‌ కరెంట్‌ చార్జీలు రద్దుకరోనా కారణంగా దెబ్బతిన్న చలనచిత్ర పరిశ్రమకు చేయూత ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. వైరస్‌ విజృంభించిన ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు థియేటర్ల యాజమాన్యాలు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ కరెంటు చార్జీలను పూర్తిగా రద్దు చేసింది. మల్టీప్లెక్స్‌ సహా అన్ని థియేటర్లకూ ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి నెలకు మూడు కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వం మోయనుంది. మిగిలిన ఆరు నెలల ఫిక్స్‌డ్‌ కరెంటు చార్జీలను తక్షణమే కాకుండా వాయిదాల్లో  చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది.


దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరుతుంది. అలాగే రిసార్ట్‌ ప్యాకేజీ కింద ఏ, బీ సెంటర్లలోని థియేటర్లకు రూ.పది లక్షల చొప్పున, సీ సెంటర్లలోని థియేటర్లకు రూ.5 లక్షల చొప్పున రుణాలు అందించేలా చర్యలు చేపడుతుంది. అదేవిదంగా తొలి ఆరునెలల పాటు మారటోరియం వర్తిస్తుంది. ఆ తర్వాతి ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది.

Read more