ఉప్పొంగిన వాగులు
ABN , First Publish Date - 2020-09-14T07:52:25+05:30 IST
అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.
భారీ వర్షాలకు
నీట మునిగిన పంట పొలాలు
పశ్చిమలో గోడ కూలి 98 గొర్రెలు మృతి
కడపలో పెన్నానది పరవళ్లు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్):
అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. పశ్చిమగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎర్రకాల్వ, తమ్మిలేరు, జల్లేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. చాలా ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ద్వారకా తిరుమల మండలం సత్తెన్నగూడెంలో గోడకూలి 98 గొర్రెలు చనిపోయాయి.
కడప జిల్లాలోనూ శనివారం రాత్రి నుంచి కుండపోతగా వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగాయి. జలాశయాలు కళకళాడుతున్నాయి. పెన్నానది పరవళ్లు తొక్కుతోంది. పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. ప్రొద్దుటూరు మండలంలో సుమారు వంద ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ఖాజీపేట వద్ద నల్లవాగు ఉప్పొంగి బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. కర్నూలు జిల్లాలో కురిసిన వర్షాలకు కుందూ నది నుంచి 30 వేల క్యూసెక్కులు వరద పెన్నాలో కలిసింది. బి.కోడూరు మండలంలో లోయర్ సగిలేరు ప్రాజెక్టు ఉప్పొంగింది. కృష్ణాజిల్లాలోనూ భారీ వర్షాలకు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ప్రకాశం జిల్లాలో ఆదివారం సాయంత్రానికి సగిలేరు వాగు పొంగింది. ఉదయమే పశువులు మేపుకునేందుకు వాగుదాటి కొండ ప్రాంతానికి వెళ్లిన గిద్దలూరు మండలం సూరేపల్లికి చెందిన 11 మంది కాపరులు అక్కడే చిక్కుకుపోయారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు పోలీసులు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. దీంతో వాగు ఆవల తుమ్మలపల్లె గ్రామస్థులతో మాట్లాడి, అక్కడి స్కూల్లో రాత్రి బస, వసతి ఏర్పాటుచేశారు.