శీతలీకరణ యూనిట్‌లో సాంకేతిక లోపం!

ABN , First Publish Date - 2020-05-08T10:32:24+05:30 IST

ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో రెండు స్టైరిన్‌ ట్యాంకులకు అనుసంధానించిన శీతలీకరణ యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ..

శీతలీకరణ యూనిట్‌లో  సాంకేతిక లోపం!

ప్రమాదానికి అదే కారణం: కలెక్టర్‌ 


విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి): ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో రెండు స్టైరిన్‌ ట్యాంకులకు అనుసంధానించిన శీతలీకరణ యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే గ్యాస్‌ లీక్‌ అయినట్లు విశాఖ జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. ‘‘స్టైరిన్‌   సాధారణంగా ద్రవస్థితిలో ఉంటుంది. ఇది 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉంటే సురక్షితం. అయితే శీతలీకరణ యూనిట్‌ పనిచేయకపోవడం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి... రసాయనం ఆవిరం రూపంలోకి మారి లీక్‌ అయినట్లు ఫ్యాక్టరీల విభాగం ప్రాథమికంగా నిర్ధారించింది’’ అని కలెక్టర్‌ వివరించారు. ఆవిరి ప్రభావంతో 11 మంది మృతి చెందారని, మరో 1000 మందిపై ప్రభావం చూపిందని చెప్పారు.


సమగ్ర దర్యాప్తు అవసరం ఐరాస చీఫ్‌ గుటెర్రెస్‌

ఐక్యరాజ్యసమితి, మే 7: విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వెలువడి అనేకమంది మరణించిన ఘటనపై స్థానిక అధికారులు సమగ్ర దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన అధికార ప్రతినిధి స్టీఫెన్‌ డుజర్రిక్‌ గురువారం మీడియా బ్రీఫింగ్‌లో పేర్కొన్నారు. ‘మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాం. అస్వస్థతకు గురైనవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఇలాంటి ఘటనలపై స్థానిక అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని మేం భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2020-05-08T10:32:24+05:30 IST