రాష్ట్రంలో కేసులు తక్కువే

ABN , First Publish Date - 2020-04-26T09:27:50+05:30 IST

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు చాలా తక్కువని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌

రాష్ట్రంలో కేసులు తక్కువే

వేగంగా టెస్టులు చేస్తున్నా సగటున 1.66 శాతం మాత్రమే పాజిటివ్‌లు:  జవహర్‌రెడ్డి


విజయవాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు చాలా తక్కువని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా టెస్టులు నిర్వహిస్తున్నప్పటికీ పాజిటివ్‌ కేసుల రేటు మాత్రం 1.66 శాతమేనని విజయవాడలో విలేకరులకు తెలిపారు.  ‘‘దేశంలో ఇప్పటి వరకు 5,80,000 టెస్టులు నిర్వహించగా, 24,530 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. ఆ ప్రకారం పాజిటివ్‌ కేసుల రేటు దేశంలో 4.23 శాతంగా ఉంది. అత్యధికంగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో ఈ రేటు 7.16. మన రాష్ట్రంలో మాత్రం కేవలం 1.66 శాతమే నమోదయ్యాయి’’ అని వివరించారు.


శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు 6,928 కరోనా టెస్టులు నిర్వహించగా.. వాటిలో 61 పాజిటివ్‌ కేసులు వచ్చాయన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 1016 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని తెలిపారు. వీరిలో ఇప్పటివరకు 171 మందిని డిశ్చార్జి చేశామని తెలిపారు. శనివారం కొత్తగా వచ్చిన కేసుల్లో మూడు ప్రప్రథమంగా శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం ప్రాంతంలో వచ్చాయని జవహర్‌రెడ్డి  చెప్పారు. ఇవి ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా  వచ్చాయన్నారు. ఎవరికైనా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా.. ఆయాసం ఉన్నా సరే.. వెంటనే 104 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా పేషెంట్లకు ఆక్సిజన్‌ స్థాయులు తగ్గుతున్నట్టు గుర్తించామని, దీనికోసం 1900 పల్స్‌ ఆక్సీమీటర్లను వివిధ జిల్లాలకు అందించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 1170 మంది మెడికల్‌ ఆఫీసర్లను నియమించి, వారిని వివిధ జిల్లాలకు పంపించామన్నారు. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు 22,600 మంది స్వచ్ఛందంగా పని చేయడానికి పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-26T09:27:50+05:30 IST