చీరాల వైసీపీలో ముదిరిన ఆధిపత్యపోరు

ABN , First Publish Date - 2020-06-04T17:42:33+05:30 IST

చీరాల వైసీపీలో ముదిరిన ఆధిపత్యపోరు

చీరాల వైసీపీలో ముదిరిన ఆధిపత్యపోరు

ఆ నియోజకవర్గంలో ప్రత్యర్థుల మధ్య నిత్యం యుద్ధవాతావరణమే! వారు విపక్షంలో ఉన్నా.. అధికారపక్షంలో ఉన్నా- అక్కడ నిత్యం రాజకీయ సమరం కొనసాగుతూనే ఉంటుంది. పార్టీల మధ్య పోరుకన్నా వర్గపోరే అక్కడ అధికంగా కనిపిస్తుంటుంది. వినటానికి విస్తుపోయేలా ఉన్నా.. ఇది మాత్రం అక్కడ సర్వ సాధారణం. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ప్రస్తుతం అక్కడ ఎవరెవరు ఢీ అంటే ఢీ అంటున్నారు? ఇంట్రస్టింగ్ స్టోరీ మీకోసం!


   ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారే.. అలాగే ఉందట చీరాల వైసీపీలో ముఖ్య నేతల మధ్య ఆధిపత్య పోరు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో వర్గ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు.. ఇప్పుడు ఒకే ఫ్యాన్ కింద సేద తీరుతున్నారు. పోట్లాడుకునే నాయకులంతా అధికార పార్టీలోకి రావడంతో.. చీరాల రాజకీయాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. నిన్నమొన్నటి దాకా ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ, టీడీపీలోని నాయకులంతా ఇప్పుడు ఒకే గొడుగు కిందకు చేరారు. దీంతో చీరాల రాజకీయాలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. 


   నిజానికి చీరాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయం.. పార్టీల కన్నా వ్యక్తుల మీదనే ఆధారపడి నడుస్తుంది. ప్రస్తుతమీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా ఆమంచి కృష్ణమోహన్ కొనసాగుతున్నారు. ఈయన గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీచేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అంతకుముందు 2014 ఎన్నికల్లో చీరాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ పోటీచేసి గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఆమంచి చేతిలో టీడీపీ అభ్యర్థిని పోతుల సునీత ఓటమి పాలయ్యారు. అప్పుడు ఆమె ఓడినా.. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో పోతుల సునీత ఏడాదిపాటు నియోజకవర్గంలో చక్రం తిప్పారు. ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీలో చేరారు. పోతుల సునీత, ఆమంచి కృష్ణమోహన్ ఇద్దరూ అప్పట్లో అధికార పార్టీలోనే ఉండటంతో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. ఐదేళ్లపాటు వారిద్దరూ ఉప్పు- నిప్పుగా ఉన్నారు.


   అయితే 2019 ఎన్నికల సమయంలో ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలో చేరారు. దీంతో ఆయన్ను ఎన్నికల్లో ఎదుర్కొనేందుకు టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంని రంగంలోకి దించింది. ఆ సమయంలో చీరాల నియోజకవర్గంలో ఆమంచికి వ్యతిరేకంగా ఉన్న పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు, యడం బాలాజీ వంటి నాయకులు కరణం బలరాం పక్కన నిలబడ్డారు. దీంతో ఎన్నికల్లో ఆయన అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అయితే కరణం గెలుపొందినా.. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ చక్రం తిప్పుతున్నారు. పార్టీ కార్యక్రమాల నుండి ప్రభుత్వ కార్యక్రమాలు, అటెండర్ నుండి అధికారి వరకూ బదిలీలు ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. మొత్తంగా 2019 ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారే లక్ష్యంగా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయం నడుపుతున్నారు.


   అయితే చీరాలలో ఆమంచి కృష్ణమోహన్ ఆధిపత్యానికి ఇటీవల ఇతర పార్టీల నుంచి వైసీపీలో చేరిన పలువురు నేతలు గండికొడుతున్నారు. మూడు నెలల క్రితం ఆమంచి ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ వైసీపీలో చేరారు. పార్టీలో చేరినప్పటి నుండి పోతుల సునీత చీరాలలో యాక్టివ్‌గా తిరుగుతున్నారు. తాజాగా  చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ కండువా కప్పుకోకపోయినా.. సీఎం జగన్‌ని కలిసి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆయన కొడుకు కరణం వెంకటేశ్ కి దగ్గరుండి మరీ వైసీపీ కండువా కప్పించారు. కరణం వెంకటేశ్ తోపాటు మాజీ మంత్రి పాలేటి రామారావు కూడా వైసీపీలో చేరారు. ఈ విధంగా ఆమంచికి నిన్నమొన్నటి వరకూ ప్రత్యర్థులుగా ఉన్న వాళ్లంతా ఇప్పుడు వైసీపీలోనే ఉంటున్నారు. ఇది సహజంగానే ఆధిపత్య పోరుకి దారితీసిందనీ, వర్గ రాజకీయాలను తీవ్రతరం చేసిందనీ చీరాలలో జోరుగా చర్చ జరుగుతోంది.


   ఇప్పుడు చీరాల వైసీపీలో వర్గ రాజకీయాలకు కాలు దువ్వుకుంటున్న నేతలు..  గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆధిపత్యం కోసం పాకులాడారు. ప్రస్తుతం ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం, ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావు మధ్య ఆధిపత్య పోరు ఇంకా తీవ్రతరం అయింది. ఇటీవల వలంటీర్ల నియామకాల సందర్భంగా కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్‌లు ఇద్దరు వారి అనుచరులకు పోస్టులు ఇప్పించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ విషయమై ఇద్దరూ మంత్రి బాలినేనిని కలిశారు. అయితే చీరాల మున్సిపాలిటీ పరిధిలోని వార్డు వలంటీర్ల నియామకంలో బలరాం సిఫార్సు చేసినవారికే ఉద్యోగాలు లభించాయి. దీంతోపాటు అధికారుల బదిలీల వ్యవహారానికి సంబంధించి పోలీసు, ఇతర శాఖల్లోని కొందరు బదిలీలపై ఎమ్మెల్యే బలరాం దృష్టి సారించారట. రాజకీయంగా చురుగ్గా ఉంటున్న ఆయన కుమారుడు వెంకటేష్‌ ఈ వ్యవహారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లి చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. ఏ విషయంలోనైనా తమ సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరారట. బాలినేనిని కలిసిన వెంకటేశ్.. ఎమ్మెల్యేగా పాలనాపరమైన వ్యవహారాలను చక్కబెట్టేందుకు, నియోజకవర్గ అభివృద్ధికి తన తండ్రి బలరాం చేస్తున్న కృషికి ఆమంచి అడ్డు తగులుతున్నారని చెప్పారట. ఇది పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు మంచిదికాదని తమకు సహకరించాలని బాలినేనిపై ఒత్తిడి పెంచారట. ఈ విషయం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది.


   ఇదిలాఉంటే, తాజాగా గ్రామ కాపును ఎన్నుకునే విషయంలోనూ ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇరువర్గాల వారు బాహాబాహీకి దిగడంతో.. చీరాల వైసీపీలో వర్గరాజకీయాలు ఏ స్థాయికి చేరాయో అర్థమవుతోంది. ఎవరికివారు ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు తరచూ రోడ్డుకెక్కుతున్నారు. దీంతో వైసీపీ అధిష్టానం అప్రమత్తమైంది. చీరాల నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనని దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన నేతలతోపాటు ఆ నియోజకవర్గ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న కీలక నేతను పూర్తి సమాచారం కోరినట్లు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరు నేతల్లో ఎవరిది పైచేయి అవుతుందో.. చీరాల వైసీపీలో ఆధిపత్యం ఎవరికి దక్కుతుందో చూడాలి. 

Updated Date - 2020-06-04T17:42:33+05:30 IST