కిక్కు.. దిగలేదు!

ABN , First Publish Date - 2020-05-24T08:01:59+05:30 IST

‘మద్యం మాటెత్తితే షాక్‌ కొట్టాలి. అందుకే ధరలు పెంచుతున్నాం. మద్యం నియంత్రణకు ఇదో మార్గం’.. ఇదీ ప్రభుత్వ వాదన. షాక్‌ కొడుతున్న మాట నిజమే గానీ.. కిక్కయితే దిగలేదు.

కిక్కు.. దిగలేదు!

గుప్పుమంటున్న నాటు సారా

గంజాయి మత్తులో యువత

తరలివస్తోన్న పక్క రాష్ట్రాల మద్యం

మద్యం ధరల షాక్‌తో కొత్త దారులు


అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ‘మద్యం మాటెత్తితే షాక్‌ కొట్టాలి. అందుకే ధరలు పెంచుతున్నాం. మద్యం నియంత్రణకు ఇదో మార్గం’.. ఇదీ ప్రభుత్వ వాదన. షాక్‌ కొడుతున్న మాట నిజమే గానీ.. కిక్కయితే దిగలేదు. మందు బాబులు కొత్త మార్గాలు వెతుక్కొంటున్నారు. కూలి జనం సారా కోసం పరుగులు పెడుతుంటే.. యువత గం‘జాయ్‌’ని వెతుక్కొంటోంది. మద్యమే తాగాలనుకుంటున్నవారు.. పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ప్రభుత్వం భారీగా ధరలు పెంచడంతో ఈ ప్రభావం మద్యం అమ్మకాలపై స్పష్టంగా కనిపిస్తోంది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 76 శాతం అమ్మకాలు పడిపోయాయి. గతేడాది మే 4 నుంచి 20 వరకు మొత్తం 35 లక్షల కేసులు అమ్మితే, ఈ ఏడాది కేవలం 8.3లక్షల కేసుల మద్యమే అమ్ముడైంది. అంటే 76శాతం అమ్మకాలు పడిపోయాయి. బార్లు లేకపోవడం, రెడ్‌ జోన్లలో షాపులు తెరుచుకోకపోవడం కూడా అమ్మకాలు తగ్గడానికి కారణమైనా.. షాపుల్లో కూడా ధరల పెరుగుదల వల్ల అమ్మకాలు పడిపోయాయి. ఇదే సమయంలో సారా అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. సారా నియంత్రణ కోసం ప్రభుత్వం కొత్తగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఈ బ్యూరో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి వారం రోజుల్లోనే దాదాపు వెయ్యి కేసులు నమోదు చేసింది. అంటే సారా ఉత్పత్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం తాగితే డబ్బే పోయేది.. ఇప్పుడు ఆరోగ్యానికే ప్రమా దం వచ్చింది. విచ్చలవిడిగా దొరుకుతున్న సారా తాగితే ప్రాణాలకే ముప్పు ఏర్పడుతుందనే ఆందోళన నెలకొంది.


పెరుగుతున్న గంజాయి వినియోగం

మద్యం ధరలు పెరగడంతో యువత గంజాయి వైపు మళ్లుతోంది. గతంలో ఏజెన్సీలోనే గంజాయి వినియోగం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మైదాన ప్రాంతాలకూ విస్తరించింది. మునుపెన్నడూ గంజాయి మొహం చూడనివారు  ఇప్పుడు దానికి అలవాటు పడుతున్నారు. మద్యం పూర్తిగా అందుబాటులో లేని గుంటూరు జిల్లా లాంటి ప్రాంతాల్లో ఇది ఇంకా పెరుగుతోంది. ఈ జిల్లాలో కరోనా కేసుల వల్ల మద్యం డిపోలు మూసేయడంతో షాపులు మూతపడ్డాయి. పక్క జిల్లాల నుంచి ఎక్కువ ధరకు మందు తెచ్చుకోలేక ఇక్కడివారు గంజాయికి అలవాటుపడుతున్నారు. ‘ఎప్పుడో మా చిన్నప్పుడు గంజాయి తాగేవారిని చూశాం. మళ్లీ ఇప్పుడు మా ఊర్లో గంజాయి పేరు బాగా వినిపిస్తోంది. రాత్రయితే కుర్రోళ్లు పొలాల్లోకి వెళ్లి గంజాయి తాగి వస్తున్నారు’ అని గుంటూరు జిల్లా పెదకూరపాడుకు చెందిన ఓ పెద్దాయన వాపోయారు.


పక్కరాష్ట్రాల మద్యం తరలివస్తోంది

రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడం ఎన్‌డీపీల్‌ (నాన్‌ డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌) అమ్ముకునే వారికి వరంగా మారింది. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా పన్ను చెల్లించని మద్యం దిగుమతి అవుతోంది. రెండు రాష్ర్టాల మధ్య ధరల వ్యత్యాసం భారీగా ఉండటంతో ఎన్‌డీపీఎల్‌కు డిమాండ్‌ పెరిగిపోయింది. ఓ ప్రముఖ కంపెనీ బ్రాండ్‌ క్వార్టర్‌ తెలంగాణలో రూ.140 ఉంటే ఏపీలో రూ.250 ఉంది. దీంతో మందుబాబులు ఎన్‌డీపీఎల్‌ వైపు చూస్తున్నారు. తెలంగాణ సరిహద్దు జిల్లాలైన గుంటూరు, కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీగా ఎన్‌డీపీఎల్‌ వచ్చిపడుతోంది. ఇటీవల గుంటూ రు, కర్నూలు జిల్లా సరిహద్దుల్లో వందల సంఖ్యలో ఎన్‌డీపీఎల్‌ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు మద్యం అమ్మకాలు తగ్గినా ప్రభుత్వానికి ఆదాయం పెద్దగా తగ్గలేదు. గతేడాది మే 4 నుంచి 20 వరకూ రూ.995 కోట్ల మద్యం అమ్మితే 790 కోట్లు ఆదాయం వచ్చింది. ఇప్పుడు రూ.838 కోట్లు అమ్మినా అందులో 90శాతం లాభాలు ఉన్నాయి. అంటే దాదాపు 750 కోట్ల ఆదాయం వచ్చింది.

Updated Date - 2020-05-24T08:01:59+05:30 IST