మతాల మధ్య చిచ్చుపెడితే ఉపేక్షించం

ABN , First Publish Date - 2020-09-13T07:43:36+05:30 IST

‘మత సామరస్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రతీక. అటువంటి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆకతాయిలు ప్రయత్నిస్తే కఠినంగా అణచివేస్తాం’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. ద

మతాల మధ్య చిచ్చుపెడితే ఉపేక్షించం

  • ఆకతాయిలను కఠినంగా అణచివేస్తాం
  • ఆలయాలు, ప్రార్థనా మందిరాల భద్రతపై సమీక్షలో డీజీపీ సవాంగ్‌ 

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ‘మత సామరస్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రతీక. అటువంటి రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఆకతాయిలు ప్రయత్నిస్తే కఠినంగా అణచివేస్తాం’ అని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హెచ్చరించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన అంతర్వేది ఆలయ రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద భద్రతా చర్యలపై జిల్లాల ఎస్పీలు, విశాఖ, విజయవాడ పోలీస్‌ కమిషనర్లతో శనివారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. సోషల్‌ మీడియాలో అసత్యాలను వ్యాప్తి చేసేవారిపై మరింత నిఘా ఉంచాలన్నారు.


అంతర్వేది ఘటనను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు మతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని ఎస్పీలను అప్రమత్తం చేశారు. అటువంటి చర్యలను ఉపేక్షించవద్దని, కఠిన చర్యలు తీసుకొని అణచివేయాలన్నారు. కొందరు ఆకతాయిలు సోషల్‌ మీడియాలో వివాదాస్పద సందేశాలు, వీడియోలు, ఫొటోలు పంపితే నమ్మవద్దని ప్రజలను పోలీస్‌ బాస్‌ కోరారు. ఇటువంటి వ్యక్తులపై నిఘా పెట్టామన్నారు. తమకు వచ్చే సందేశాల్లో ఏమాత్రం అనుమానం ఉన్నా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-09-13T07:43:36+05:30 IST