ఇప్పుడు ఎన్నికలొస్తే.. జగన్‌కు 23 కూడా రావు
ABN , First Publish Date - 2020-03-02T09:31:59+05:30 IST
సీఎం జగన్ దురద్దేశంతోనే మూడు రాజఽధానుల ప్రకటన చేశారని.. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...

- అమరావతికి కట్టుబడి ఉన్నాం
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా
- కన్నావారి తోట నుంచి భారీ ర్యాలీ
సీఎం జగన్ దురద్దేశంతోనే మూడు రాజఽధానుల ప్రకటన చేశారని.. రాజధాని అమరావతికి బీజేపీ కట్టుబడి ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. జగన్‌కు ప్రతిపక్ష టీడీపీకి వచ్చిన 23 సీట్లు కూడా రావని దుయ్యబట్టారు. అమరావతి రైతులకు సంఘీభావంగా ఆయన ఆదివారం పార్టీ నేతలతో కలసి తుళ్లూరు దీక్షా శిబిరంలో ప్రసంగించారు. తొలుత గుంటూరు కన్నావారి తోట నుంచి భారీ వాహన శ్రేణితో తుళ్లూరు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కన్నా మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ పాలన సాగుతోందో.. పోలీసు పాలన సాగుతోందో అర్థం కావడం లేదన్నారు. రాజధాని పేరుతో తమ భూములు కబ్జా చేస్తారనే భయంతో విశాఖ ప్రజలు హడలుతున్నారని అన్నారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు సభలో మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, రావెల కిశోర్‌బాబు, శనక్కాయల అరుణ పాల్గొన్నారు.
బీజేపీ నేతల నిలదీత
బీజేపీ నేతలు అమరావతిపై స్పష్టమైన ప్రకటన చేస్తారని ఆశపడ్డ తమకు నిరాశే ఎదురైందని 29 గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సభ అనంతరం బీజేపీ నేతలు రమేశ్‌నాయుడు, యామిని శర్మ తదితర నేతలను మహిళలు నిలదీశారు. కనీసం ‘జై అమరావతి’ అనని వారు మాకేం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.