విష పరిశ్రమలను గుర్తించండి

ABN , First Publish Date - 2020-05-09T09:51:10+05:30 IST

విషవాయువులను వెదజల్లే పరిశ్రమలు జనావాసాలకు దూరంగా ఉండేలా మార్గదర్శకాలను, వాటి తరలింపునకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు.

విష పరిశ్రమలను గుర్తించండి

జనావాసాలకు దూరంగా ఉండాలి

వాటి తరలింపు కోసం కార్యాచరణ

కాలుష్య పరిశ్రమలపైనా మదింపు

లీకేజీపై విచారణ జరిపి నివేదిక

మిగిలిన రసాయనం తరలింపుపై

నిపుణుల సలహాలను తీసుకోండి

వెంటనే పరిహారాన్ని అందించండి

సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు

ఎల్జీ పాలిమర్స్‌ అదుపులోనే....

వివరించిన సీఎస్‌, కలెక్టర్‌, సీపీ


అమరావతి, మే 8 (ఆంధ్రజ్యోతి): విషవాయువులను వెదజల్లే పరిశ్రమలు జనావాసాలకు దూరంగా ఉండేలా మార్గదర్శకాలను, వాటి తరలింపునకు కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదికను అందించాలని కోరారు. ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం తక్షణమే అందించాలని సీఎ్‌సను ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం నిర్వహించిన సమీక్షా సమావేశంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా విశాఖ నుంచి సీఎస్‌ నీలం సాహ్ని , కలెక్టర్‌ వినయ్‌  చంద్‌, పోలీస్‌ కమిషనర్‌ ఆర్‌కే మీనా తదితరులు పాల్గొన్నారు. ‘‘విశాఖలో ఇలాంటి విషవాయువులు వెదజల్లే పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో గుర్తించాలి. జనావాసాల మధ్య కాలుష్య కారక పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో కూడా చూడండి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేయండి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఫ్యాక్టరీలో మిగిలిన ఉన్న రసాయనాలను  తరలించడానికి ఉన్న అవకాశాలనూ పరిశీలించి తగిన ఆలోచనలు చేయాలి. లేదా ఉన్న ముడిపదార్థాలను పూర్తిగా వినియోగించేలా చర్యలు చేపట్టాలి. దీనిపై ఇంజనీరింగ్‌ నిపుణులతో మాట్లాడండి’’ అని సీఎ్‌సను సీఎం ఆదేశించారు.


ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని సీఎం జగన్‌కు సీఎస్‌, కలెక్టర్‌, సీపీ వివరించారు. ఫ్యాక్టరీలో గ్యాస్‌ లీక్‌ నివారణకు చేపట్టిన చర్యలను సీఎం దృష్టికి వారు తెచ్చారు. ‘‘ట్యాంకులోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్‌ అయింది. మిగిలిన 40శాతం కూడా అలా  కావడానికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులూ భద్రం గా ఉన్నాయి’’ అని సీఎస్‌ వివరించారు. స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ నీరబ్‌ ప్రసాద్‌, పీసీబీ మెంబర్‌ సెక్రటరీ వివేక్‌ యాదవ్‌ విశాఖకు వస్తున్నారని, దుర్ఘటనపై సమగ్ర  విచారణ జరిపి తగిన కార్యాచరణ ప్రణాళికతో రావాలని సీఎ్‌సను సీఎం జగన్‌ ఆదేశించారు. కాలుష్య నివారణ మండలి సమగ్రంగా క్రియాశీలకంగా ఉండాలన్నారు.  కాలుష్యకారక అంశాలు, ఫిర్యాదులపై పాటించాల్సిన స్టాండర్డ్‌ ఆపరేషన్స్‌ ప్రొసీజర్స్‌ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

Updated Date - 2020-05-09T09:51:10+05:30 IST