ఇంజనీరింగ్‌ ఫీజుల్లో భారీ కోత

ABN , First Publish Date - 2020-03-13T08:38:53+05:30 IST

ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజుల్లో భారీగా కోత పడింది. రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకుగాను సగం కాలేజీలకు రూ.35వేల కనీస ఫీజు ఖరారైంది. రాష్ట్రంలోని టాప్‌ కాలేజీలకు సైతం...

ఇంజనీరింగ్‌ ఫీజుల్లో భారీ కోత

  • 35,000 - 75,000 మధ్యలోనే ఫిక్స్‌
  • టాప్‌ కాలేజీలకు సైతం రూ.75 వేలతోనే సరి
  • 35 వేల కనిష్ఠంలో మెజారిటీ కాలేజీలు
  • ఈ ఫీజులు 2019-20 విద్యా సంవత్సరానికే
  • మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ ఇవే ఫీజులు
  • ప్రతిపాదనలకు సీఎం సూత్రప్రాయ ఆమోదం
  • నేడు ప్రభుత్వానికి సమర్పించనున్న కమిషన్‌


అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ట్యూషన్‌ ఫీజుల్లో భారీగా కోత పడింది. రాష్ట్రంలో మొత్తం 287 ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకుగాను సగం కాలేజీలకు రూ.35వేల కనీస ఫీజు ఖరారైంది. రాష్ట్రంలోని టాప్‌ కాలేజీలకు సైతం గరిష్ఠంగా రూ.75వేల లోపు ఫీజుతోనే సరి. మిగిలిన కాలేజీలకు రూ.35వేల కనిష్ఠ,  రూ.75వేల గరిష్ఠ ఫీజుల మధ్యలోనే ఉంటాయి. ఈ ఫీజులు 2019-20 విద్యా సంవత్సరానికే అమల్లో ఉంటాయి. ఈ సారికి మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ ఇవే ఫీజులు వర్తించనున్నాయి.


ఈ మేరకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ చేసిన తాజా ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. గురువారం రాత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వద్ద ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇంజనీరింగ్‌ ఫీజులపై ఇటీవల చేసిన ప్రతిపాదనల పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో... కమిషన్‌ ఈ సారి ఫీజులను భారీగా తగ్గిస్తూ సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచింది. జగన్‌ వీటికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఇటీవల చేసిన సిఫారసుల ప్రకారం 10 ఇంజనీరింగ్‌ కాలేజీలకు రూ.91వేల నుంచి రూ.99 వేల మధ్యలో ఫీజు ఫిక్స్‌ చేశారు. అయితే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్న తరుణంలో కన్వీనర్‌ కోటాలో ఫీజులు పెంచడంతో పాటు మేనేజ్‌మెంట్‌ కోటాలోనూ డబుల్‌ ఫీజుకు సిఫారసు చేస్తారా? అని సీఎం అసంతృప్తి వ్యక్తం చేస్తూ రీ వర్క్‌ చేయాలని ఆదేశించారు.


దీంతో ఇప్పుడు ఫీజులను అసాధారణంగా తగ్గించడం గమనార్హం. ట్యూషన్‌ ఫీజు బకాయిలు ఈ నెల 30 లోపు విడుదల చేయాలని సీఎం ఆదేశించిన నేపథ్యంలో 2019-20 విద్యా సంవత్సరానికే ఈ ఫీజులు వర్తింపజేయాలని నిర్ణయించారు. మిగిలిన 2020-21, 2021-22 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులను వారం-పది రోజుల్లో సిఫారసు చేయాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. తాజా ఫీజుల ప్రతిపాదనలను  శుక్రవారం ఉన్నతవిద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ సతీశ్‌చంద్రకు కమిషన్‌ సమర్పించనుంది. రెండు రోజుల్లో ఈ ఫీజులకు ఉత్తర్వులు జారీచేస్తారు. ప్రతి మూడు సంవత్సరాల బ్లాక్‌ పిరియడ్‌కు ఒకసారి ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ట్యూషన్‌ ఫీజులను నిర్ధారించాల్సి ఉంది. కానీ కమిషన్‌ వీటిని పట్టించుకోకుండా, ఆదాయ-వ్యయాలను ప్రాతిపదికగా తీసుకోకుండా ఫీజులను భారీగా తగ్గించడం పట్ల  కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

Updated Date - 2020-03-13T08:38:53+05:30 IST