ఇళ్ల పట్టాలు ఇవ్వొచ్చు!

ABN , First Publish Date - 2020-03-21T09:04:24+05:30 IST

పేదలకు ఇళ్ల స్థలాలను అందించే ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలనుకొంటున్నామన్న ప్రభుత్వం

ఇళ్ల పట్టాలు ఇవ్వొచ్చు!

  • పేదల స్థలాల పంపిణీకి ఎస్‌ఈసీ ఓకే

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పేదలకు ఇళ్ల స్థలాలను అందించే ‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆమోదం తెలిపింది. ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయాలనుకొంటున్నామన్న ప్రభుత్వం ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకుని ఈ కార్యక్రమానికి ఆమోదముద్ర వేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఉన్న పథకాలను కొనసాగించడానికి సుప్రీంకోర్డు తన తీర్పులో అనుమతినిచ్చిందని, పేదల స్థలాలు కార్యక్రమం అలాంటి పథకమేనని ప్రభుత్వం తెలిపిందని ఆ ప్రకటనలో ఎన్నికల సంఘం పేర్కొంది. వాస్తవాలను తగినవిధంగా పరిగణనలోకి తీసుకునే కమిషన్‌ ఇందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించింది. కాగా, హైదరాబాద్‌లోని కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ సాధారణ విధులు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.


కరోనా కాలంలో కలిసొచ్చిన ‘వాయిదా’

రాష్ట్రంలో స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ ముందుచూపుతో వ్యవహరించారని సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉధృతం కావడం, కర్ణాటక, తెలంగాణలో కరోనా కేసులు నమోదు కావడంతో వాటికి పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు దీని ప్రభావం సోకడానికి ఎంతో సమయం పట్టదని ఆయన ముందే ఊహించారని పలువురు పేర్కొంటున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు అనుకున్న ప్రకారం జరిగి ఉంటే శనివారం, ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చేది. దేశ వ్యాప్తంగా కరోనాపై కేంద్రప్రభుత్వం హై అలర్ట్‌ ప్రకటించడం, సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూ ప్రారంభానికి పిలుపునివ్వడాన్ని పరిశీలించినవారు.. ఇలాంటి సందర్భంలో ఎన్నికలు నిర్వహించి ఉంటే పరిస్థితి ఎలా ఉండదనేది ఊహించలేకపోతున్నామని వ్యాఖ్యానిస్తున్నారు. రమేశ్‌కుమార్‌ నిర్ణయాన్ని మొదట్లో వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇప్పుడు దానిని ఒప్పుకోక తప్పడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


స్థానిక ఎన్నికలను కరోనా కారణంగా వాయిదా వేసిన సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై గుర్రుమన్న ప్రభుత్వం.. మొదట్లో కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా సీఎం జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి రమేశ్‌కుమార్‌ను విమర్శించడానికే ప్రాధాన్యం ఇస్తూ, కరోనా ఎక్కడుందని ప్రశ్నించారు. దీంతో రాష్ట్రంలో ఎన్నికల వాయిదా అంశం వివాదాస్పదమైంది. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్‌ ముందురోజు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అన్ని పార్టీలతో సమావేశమైనప్పుడు ఒక్క వైసీపీ తప్ప మిగిలిన పార్టీలు కరోనా వ్యాప్తిని ప్రస్తావించి, ఇప్పుడు ఎన్నికలు ఏమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేశాయి. అప్పట్లో రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం, వైద్యశాఖ అధికారులు కూడా ఎన్నికలకు కరోనా వల్ల ఇబ్బంది ఉండదని చెప్పడంతో రమేశ్‌కుమార్‌.. ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపారు. అయితే, ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత దేశ వ్యాప్తంగా వైరస్‌ వ్యాప్తిపై ఆందోళనలు తీవ్రమయ్యాయి. దీంతో రమేశ్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఆయన తీసుకోకుండా ఉండి ఉంటే ఇప్పుడైనా ఎన్నికలు ఆపేయాల్సి వచ్చేదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లోనే బలంగా వ్యక్తం అవుతోంది.

Updated Date - 2020-03-21T09:04:24+05:30 IST