హోటలే హాస్పిటల్!
ABN , First Publish Date - 2020-07-27T08:11:48+05:30 IST
కరోనా కాలంలో హోటళ్లు కూడా హాస్పిటళ్లుగా మారుతున్నాయి. అన్‌లాక్ దశ తరువాత విజృంభించేస్తున్న కొవిడ్ కేసులతో ..

ప్రైవేటు ఆస్పత్రుల కొత్త రూటు
పలు స్టార్ హోటళ్లు అద్దెకు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): కరోనా కాలంలో హోటళ్లు కూడా హాస్పిటళ్లుగా మారుతున్నాయి. అన్‌లాక్ దశ తరువాత విజృంభించేస్తున్న కొవిడ్ కేసులతో ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఒకరు పడుకొంటే పది మంది ఆ బెడ్ కోసం వెయిటింగ్‌లో ఉంటున్నారు. కొంతమంది ఏకంగా ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యంతో డీల్ చేసుకొంటున్నారు. ఎవరైనా రోగులు డిశ్చార్జ్ అయితే ఆ బెడ్ తమకు ఇచ్చేలా రిజర్వ్ చేయించుకొంటున్నారు. ఈ కొరతను అధిగమించడానికి పలు ప్రైవేటు ఆస్పత్రులు... ఇప్పుడు హోటళ్ల వైపు పరుగులు పెడుతున్నాయి. వాటిని అద్దెకు తీసుకొని వార్డులుగా మార్చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 40 వేల మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇంతమందికి సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. బెడ్ల కోసం తిరిగి వేసారి.. చివరికి కొందరు ఇంటిలోనే క్వారంటైన్‌లో ఉంటున్నారు.
ఇదంతా గమనిస్తున్న పలు ప్రైవేటు ఆస్పత్రులు కొత్త రూటు కనిపెట్టాయి. ప్రత్యేకించి కరోనా బాధితుల కోసమే హోటళ్లకు అద్దెకు తీసుకోవాలని నిర్ణయించాయి. లక్షణాలు తక్కువగా ఉన్న వారికే ఈ హోటళ్లలో చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల మాదిరిగానే ఈ హోటళ్లను కూడా స్పెషల్ రూమ్స్, డబుల్ రూమ్స్, సింగిల్ రూమ్స్, జనరల్ వార్డులుగా విభజించారు. కరోనా బాధితులు స్థోమతను బట్టి నచ్చిన గదుల్లో చేరవచ్చు. ఎక్కువమంది మాత్రం సింగిల్ రూమ్స్‌నే తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. బిల్లు కూడా వారు తీసుకున్న రూమ్‌ను బట్టి ఉంటుంది. వారికి హోటల్ కింద ఉండే రెస్టారెండ్‌లోనే ఆహార ఏర్పాట్లు ఉంటున్నాయి. పైగా చాలా హోటళ్లు మెయిన్ రోడ్డుకు అనుసంధానంగా ఉంటాయి. బాధితులు ఏ అవసరాన్ని అయినా తీర్చుకోవడం సులభంగా ఉంటుంది.
హోటళ్లకూ పండగే!
కరోనా దెబ్బకు ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా స్టార్ హోటళ్లు మూతపడ్డాయి. ఆక్యుపెన్సీ పూర్తిగా పడిపోయింది. హోటల్ తెరిస్తే నిర్వహణ ఖర్చులయినా పోతాయనే గ్యారంటీ లేదు. చాలా జిల్లాల్లో ఒకటి లేదా రెండు హోటళ్లలోనే అంతంత మాత్రంగా గదులు బుక్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల ఆఫర్‌కు పలు హోటళ్ల యాజమాన్యాలు ఎగిరి గంతేస్తున్నాయి. దీంతో ఐదు నెలల క్రితం వరకూ పర్యాటకులతో కిక్కిరిసిన హోటళ్లు ఇప్పుడు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఇక మరికొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలు తమ వద్ద విధులు నిర్వహించే వైద్యులు, వైద్య సిబ్బంది కోసం హోటళ్లను అద్దెకు తీసుకుంటున్నాయి. వైద్యుల్లో కానీ వైద్య సిబ్బందిలో కానీ ఎవరైనా కరోనా బారినపడితే వారికి వెంటనే ఈ హోటళ్లలో ఒక ప్రత్యేక గది కేటాయిస్తున్నారు. అక్కడే వారికి రెండు వారాల పాటు చికిత్స అందిస్తున్నారు.