ఉద్యాన రైతు కన్నీరు

ABN , First Publish Date - 2020-04-07T10:03:56+05:30 IST

కరువు సీమలో ఉద్యాన పంటలు సిరులు కురిపిస్తాయి. గత రెండు మూడేళ్లుగా ఉద్యానపంటలే ఇక్కడి రైతుకు జీవనాధారమవుతున్నాయి.

ఉద్యాన రైతు కన్నీరు

దిగుబడి ఆశాజనకం.. గిట్టుబాటు ధర శూన్యం

దారుణంగా పడిపోయిన ధరలు.. కోత లేక చెట్లపైనే చీనీ, ద్రాక్ష

పక్వానికి వచ్చినా పొలాలకే పరిమితం.. స్తంభించిన వాహన రవాణా

అరకొర ఎగుమతులతో రైతు సతమతం


అనంతపురం, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): కరువు సీమలో ఉద్యాన పంటలు సిరులు కురిపిస్తాయి. గత రెండు మూడేళ్లుగా ఉద్యానపంటలే ఇక్కడి రైతుకు జీవనాధారమవుతున్నాయి. ఈసారి కూడా పండ్ల తోటల దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో అప్పుల నుంచి గట్టెక్కవచ్చన్న రైతన్న ఆశలను కరోనా మహమ్మారి చిదిమేసింది. పంట చేతికొచ్చే సమయంలోనే దేశమంతటా లాక్‌డౌన్‌ అమల్లోకి రావడంతో ఎగుమతులు, దిగుమతులు ఎక్కడివక్కడ స్తంభించిపోయాయి. పంటలను కొనే నాథుడే కరువయ్యారు. కొనుగోలు చేసేందుకు వచ్చిన కొద్ది మంది వ్యాపారులు కూడా.. సగం ధరకు బేరమాడుతున్నారు. దీంతో పొలంలో పంటను వదిలేయలేక  సగం ధరకే పంటను అమ్ముకోవాల్సిన దుస్థితి.


2 లక్షల హెక్టార్లలో..

అనంతపురం జిల్లాలో 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. ఇందులో అత్యధికంగా దాదాపు 50 వేల ఎకరాల్లో అరటి, 53 వేల ఎకరాల్లో చీనీ, 2500 ఎకరాల్లో కళింగర, 700 ఎకరాల్లో ద్రాక్ష, మరో 1000 ఎకరాల్లో కర్బూజ సాగులో ఉంది. మిగిలిన వాటిలో టమాట, దానిమ్మ, బొప్పాయి, మామిడి, సపోటా, జామ, అల్లనేరేడు పంటలతో పాటు కూరగాయలు, పూల పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం అరటి, మామిడి, చీనీ పంటలు కోతలో ఉన్నాయి. కానీ చెట్లపైనే పంటను కుళ్లబెట్టలేక అయినకాడికి అమ్ముకోవలసిన దుస్థితి నెలకొంది. పెట్టుబడి వ్యయం కూడా దక్కే అవకాశాలు లేక దిగాలు పడుతున్నారు. మామిడి, బొప్పాయి, కళింగర, దానిమ్మ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సాగులో ఉంది. తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల్లోనే అరటి దాదాపు 42 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఇక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌, కలకత్తా, మహారాష్ట్ర, ఢిల్లీ, అరబ్‌ దేశాలకు ఎగుమతి అవుతోంది.


లాక్‌డౌన్‌కు ముందు నాణ్యతను బట్టి అరటి టన్ను రూ.16 వేల నుంచి రూ.16,500 వరకూ పలికింది. రవాణా స్తంభించిపోవడంతో అధికారులు ఏర్పాటు చేసిన అరకొర రవాణాతో టన్నుకు రూ.2,700 నుంచి రూ.3,250 వరకే వస్తోంది. రైతు ఎకరా అరటి సాగు చేసేందుకు దాదాపుగా రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నాడు. ఈ లెక్కన పెట్టుబడి కూడా అందడం లేదు. కళింగర, కర్బూజ ధర టన్నుకు రూ. 5 వేల నుంచి రూ.4,300కి పడిపోయింది. టన్ను రూ. 50 వేలు పలుకుతున్న ద్రాక్షను రూ.35 వేలకైతే కొంటాం.. లేకపోతే లేదన్న చందంగా వ్యాపారులు వ్యవహరిస్తున్నారు. మామిడి రైతులు సైతం టన్నుకు గతంలో కంటే రూ.20 వేలు నష్టపోతున్నారు. టమాట గతంలో నాణ్యతనుబట్టి టన్ను రూ.23 వేల నుంచి రూ.30 వేల వరకూ ధర పలుకగా.. ప్రస్తుతం కొనేందుకు వ్యాపారులు ముందు కు రావడం లేదు. టన్ను రూ.2,500 నుంచి 2,800 ధర వచ్చినా రైతు అమ్మేస్తున్నాడు. మరికొందరు రైతులు ఉచితంగా పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నారు.


పండ్ల రైతుల్ని ఆదుకోవాలి : పయ్యావుల


అమరావతి, ఏప్రిల్‌6(ఆంధ్రజ్యోతి): రాయలసీమలో, ముఖ్యం గా అనంతపురం జిల్లాలో అరటి, కర్భూజ, కలింగర(పుచ్చకాయ) రైతులను తక్షణం ఆదుకోవాలని పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అనంతపురం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఆర్థికమంత్రి రాజేంద్రనాథ్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పయ్యావుల  పాల్గొన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం నాని.. మార్కెటింగ్‌శాఖ కార్యదర్శి, కమిషనర్‌లతో ఫోన్‌లో మాట్లాడారు. పంట ఉత్పత్తుల మార్కెటింగ్‌ ద్వారా రైతులను ఆదుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు.


కరోనాతో చితికిపోయాం..గోవర్ధన్‌రాజు, రైతు

16 ఎకరాల్లో అరటిపంటను సాగుచేశా. రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టాను. పంట చేతికి వస్తున్న సమయంలో  కరోనా దెబ్బతీసింది. వైరస్‌ రాకముందు టన్ను రూ.15 వేల వరకు ధర పలికింది. ఇప్పుడు రూ.2,500కి పడిపోయింది. ధర తగ్గడంతో అమ్మలేక.. చెట్లపై ఉంచలేక ఇబ్బందులు పడుతున్నాం. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాతైనా గిట్టుబాటు ధర వస్తుందని ఎదురుచూస్తున్నాం.2 లక్షలు నష్టపోయాను... హనుమంతరాయుడు, రైతు

మూడెకరాల్లో కళింగర సాగు చేశాను. రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. పంట కోతకు వచ్చింది. లాక్‌డౌన్‌ ఉండడంతో ధర పూర్తిగా పడిపోయింది. టన్ను రూ.1,000-రూ.2,000కి అడుగుతున్నారు. మూడెకరాలకు 50 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కోతకు మరో లక్ష ఖర్చు చేయాల్సి వస్తోంది. పడిపోయిన ధరతో పంటను అమ్ముకున్నా.. పెట్టుబడి నష్టం మిగులుతుంది. నాదే కాదు... పండ్లతోటల రైతులందరి పరిస్థితీ ఇంతే. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి.Read more