నిన్న సన్మానం.. నేడు ప్రమాణం రేపు ఏం చెయ్యాలి?

ABN , First Publish Date - 2020-12-17T07:48:02+05:30 IST

నిన్న సన్మానాలు చేశారు.. నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. మరి రేపు ఏం చేయాలి? ప్రమాణం తీసుకొన్న చైర్మన్లు, డైరెక్టర్లు కూర్చోడానికి కార్యాలయాలు లేవు.

నిన్న సన్మానం.. నేడు ప్రమాణం రేపు ఏం చెయ్యాలి?

బీసీ కార్పొరేషన్లకు విధులు లేవు.. ఏర్పరిచి నెలైనా పైసా ఇవ్వలేదు

కుర్చీ లేదు, ఆఫీసూ లేదు.. నాడు చైర్మన్లకు సహాయమంత్రి హోదా

ఇప్పుడు పలకరించే దిక్కే లేదు.. నేడు సీఎం సమక్షంలో ప్రమాణం


(అమరావతి-ఆంధ్రజ్యోతి):నిన్న సన్మానాలు చేశారు.. నేడు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. మరి రేపు ఏం చేయాలి? ప్రమాణం తీసుకొన్న చైర్మన్లు, డైరెక్టర్లు కూర్చోడానికి కార్యాలయాలు లేవు.. చేయడానికి పనులు, వాటికోసం నిధులూ ఏవీ లేవు! వెరసి..బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు ప్రకటన, నియామయాల్లో హడావుడి, అట్టహాసమే చివరకు మిగిలాయని పలువురు బీసీ నాయకులే అంటున్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు నియమించిన చైర్మన్లు, డైరెక్టర్లతో సీఎం జగన్‌ గురువారం సామూహిక ప్రమాణ స్వీకారాలు చేయించనున్న నేపథ్యంలో కార్పొరేషన్ల తీరుతెన్నులు చర్చనీయాంశంగా మారాయి. గతానికి భిన్నంగా జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కార్పొరేషన్లను సొసైటీస్‌ రిజిస్టర్‌ యాక్టు కింద నమోదు చేయించింది. ఒక్కపైసా కూడా నిధులివ్వకుండానే వాటిని ఏర్పాటు చేసి, చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేసింది. వీరిలో కొందరికి పలు జిల్లాల్లో మంత్రులు సన్మానాలు చేశారు. బీసీ మంత్రులు రోజుకో ప్రెస్‌మీట్‌ పెట్టి ‘బడుగుల చాంపియన్లం’ అంటూ ప్రచారం చేసుకున్నారు.


తీరాచూస్తే.. కార్యాలయాలు లేని ‘కార్పొరేషన్లే’ చివరకు బీసీ వర్గాలకు మిగిలాయి. ప్రతి కార్పొరేషన్‌కు ఒక ఎండీ, కార్యాలయ సిబ్బంది ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పదేసి కార్పొరేషన్లకు ఒక అధికారిని ఇన్‌చార్జ్‌గా నియమించడం గమనార్హం. గత ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లకు విజయవాడ తాడిగడపలో ఓ అపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి కార్పొరేషన్‌కు సిబ్బందిని ఇచ్చింది. అక్కడి నుంచే అవి విధులు నిర్వహించేలా అన్ని వసతులు కల్పించింది. బీసీ కార్పొరేషన్లకు కేటాయించిన స్వయంఉపాధి రుణాలకు సంబంధించిన సబ్సిడీ ఈ కార్యాలయాల ద్వారా లబ్ధిదారులకు అందేది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్లు రద్దుచేసి.. ఆస్థానంలో కొత్తగా 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేశారు. వాటన్నింటికి కార్యాలయాలు ఎక్కడ ఏర్పాటుచేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. రాజధానిని విశాఖపట్నానికి మార్చాలని యోచించిన నేపథ్యంలో... విజయవాడలో పెట్టే ప్రతిపాదనను ప్రభుత్వ పెద్దలు విరమించుకున్నట్లు సమాచారం. 


నామ్‌కే వాస్తేగా...

కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి ఒక విశిష్టత ఉంది. ఈ పదవికి సహాయమంత్రి హోదా ఉండేది. కార్పొరేషన్‌ చైర్మన్‌కు రూ.రెండులక్షలకు పైగా అలవెన్సులు అందించేవారు. వైసీపీ ప్రభుత్వం 56 కార్పొరేషన్ల చైర్మన్లు, ఒక్కో కార్పొరేషన్‌కు 13 మంది చొప్పున 728మంది డైరెక్టర్లను నియమించింది. వారికిచ్చే అలవెన్సులు మాత్రం అరకొరగానే ఉన్నాయి. గతంలో అలవెన్సులు రూ.2 లక్షలకు పైగా ఇస్తున్న చైర్మన్‌ పోస్టులకు ఇప్పుడు రూ.65 వేలు, రూ.56 వేల చొప్పున ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. మరోవైపు, ఒక్క పైసా నిధులు కూడా ఈ కార్పొరేషన్ల కోసం బీసీ బడ్జెట్‌లో కేటాయించలేదు. దీంతో ప్రభుత్వం బీసీలకు ఏమీ చేయలేదన్న అపప్రద రాకుండా ఉండేందుకని, నామ్‌కే వాస్తేగా బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసినట్టు ఉన్నదని పలువురు బీసీ నేతలు పెదవి విరుస్తున్నారు. 

Updated Date - 2020-12-17T07:48:02+05:30 IST